నగరవాసులు విషం తింటున్నారు..!

by  |
నగరవాసులు విషం తింటున్నారు..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: పండ్లు.. కూరగాయలు.. ఆకు కూరలు.. మంచి ఆరోగ్యానికి గుర్తొచ్చేది ఇవే.. వెజిటేరియన్స్ ఇష్టంగా తినే వారి మెనూలో ప్రప్రథమంగా ఉండేవి ఇవే.. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆ కూరలు, పండ్లు, ఆకుకూరలను కూడా ప్రమాదంగా భావించే రోజులు వచ్చాయి. రైతులు వెజిటేబుల్స్ పండించే సమయంలో అవగాహన లేమితో క్రిమిసంహరకాలు వాడుతుండడంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటిలో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జరిపిన సర్వే లో బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌ వాసుల రోజువారీగా వినియోగిస్తున్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లోనూ హైదరాబాద్‌ పరిధిలో బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్న ప్రూట్స్, వెజిటెబుల్స్ లలో మొత్తంగా సుమారు 30శాతం మేర పెస్టిసైడ్స్‌ ఆనవాళ్లు బయటపడుతున్నాయి.

పరీక్షల్లో వెల్లడైన నిజాలు..

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌లో తీసిన వంకాయల్లో క్లోరాన్‌ట్రానిల్‌ప్రోల్‌ అనే మందు పరిమితికి మించి 17రెట్లు అధికంగా ఉన్నట్లు జులైలో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. గుడిమల్కాపూర్‌, మెహదీపట్నం, బంజారా హిల్స్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లోని మార్కెట్ల నుంచి గతేడాది డిసెంబరులో 50 పచ్చి మిర్చి నమూనాలు తీసి పరీక్షించగా 25రెట్లు కలుషితంగా ఉన్నట్లు గుర్తించారు. నోట్లో పడగానే మంట నషాళానికి అంటే ఎర్రకారంలో తెగుళ్ల నివారణకు వాడే అజోక్సీస్ట్రోబిన్‌ అనే మందు ఏకంగా 80రెట్లు అధిక పరిమాణంలో ఉంది. మనం వండుకునే చాలా కూరల్లో కరివేపాకు తప్పక కనిపిస్తుంది. ఇందులో మోతాదుకు మించి భారీ మొత్తంలో క్రిమిసంహాకర మందులున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది మే, ఆగస్టుల్లో కరివేపాకులో పురుగుమందుల అవశేషాలపై పరీక్షలు చేయగా క్లోరోఫైరిఫాస్‌ అనే మందు పరిమితికి మించి 17 రెట్లు అదనంగా ఉంది. జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ చేసిన పరీక్షల్లో వెల్లడైన భయంకర నిజాలివి. ఈ సంస్థ మూడు నెలల కిందట కూడా పలు ప్రాంతాల్లో నమూనాలను సేకరించి, పరిశోధనలు చేయగా, ఇదే తరహాలో రిజల్ట్స్ వచ్చినట్లు తెలిసింది.

కడుపులోకి కాలకూటం!

కూరలు, పండ్లపై విష రసాయనాలు అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో పరిమితికి మించి ఎటువంటి పురుగుమందుల అవశేషాలున్నా ఆహారంగా వినియోగానికి అసలు అనుమతించరు. మన దేశంలో మాత్రం ఎటువంటి పరీక్షలు లేకుం డానే వాడేస్తున్నాం. కనీసం అందులో ఏముందనే పరీక్షలూ కూడా జరగడం లేదు. మూడు నాలుగు నెలలకోసారి మొక్కు బడి పరీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపడం తప్పితే వాటిపై చర్యలు శూన్యం కేంద్ర పరిధిలోని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ(ఎన్‌ఐపీహెచ్‌ఎం) అప్పుడప్పుడు నమూనాలు తీసి ఫలితాలు వెల్లడిస్తోంది.

దుకాణాదారు చెప్పిందే మందు..

కూరగాయల పంటలు సాగు చేసే రైతులకు అందులో ఏముందో తెలియదు. పొలంలో పురుగు కన్పించిందని దుకాణదారుని అడిగి అతనిచ్చింది తెచ్చి రైతులు పిచికారీ చేస్తున్నారు. ప్రతి పురుగుమందుల దుకాణాల వద్ద ప్రతినిధులు రైతు వెళ్లగానే కొన్నిరకాల మందుల పేర్లు చెప్పి అంటగడుతున్నారు. కొన్ని మందులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రామాణికాలు లేకుండా తయారు చేస్తున్నట్లు సమాచారం ఉంది. కొందరు అర్హతలేని వ్యక్తులు శివారు ప్రాంతాల్లోని గోడౌన్లలో గుట్టు చప్పుడు కాకుండా క్రిమీసంహారక మందులను తయారు చేసి, పెస్టిసైడ్స్ దుకాణదారులకు భారీ కమీషన్ ఆశచూపి విక్రయించేలా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మేడ్చల్ జిల్లాలో్ని కొందరు పెస్టిసైడ్స్ వ్యాపారులను మచ్చిక చేసుకునేందుకు నకిలీ మందుల తయారీదారులు గోవా తీసుకువెళ్లినట్లు తెలిసింది.

రేటు పెరిగే కొద్దీ.. పురుగుమందుల బాదుడే..

కూరగాయల ధరల ప్రభావం కూడా పురుగుమందుల విక్రయాలపై పడుతోంది. టమోటా కిలో రూ.2 ఉంటే వారానికి, పక్షానికి ఒకసారి పిచికారి చేస్తున్నారు. అదే రూ.10పైన చేరి తే మాత్రం ఒక్కసారిగా శ్రద్ధ పెరుగుతుంది. చిన్న పురుగు కన్పించినా వెంటనే మందులు చల్లేస్తున్నారు. ధరలు బాగుం టే ఒక్క కాయకూడా పురుగు తాకకుండా జాగ్రత్తపడతారు. వెంటనే నివారించేందుకు మూడు రోజులకు ఒకసారి కూడా చల్లుతుంటామని తూప్రాన్ కు చెందిన కూరగాయల సాగు రైతు వీరయ్య తెలిపారు. పురుగు మందులు చల్లిన తర్వాత కోత కోయటానికి ప్రతి మందుకు నిర్దిష్టంగా కొన్ని రోజుల కాలపరిమితి ఉంటుంది.

కొన్నింటికి వారం రోజులు, మరికొన్నిటికి పక్షం వరకు వేచిఉండాలి. చాలామంది రైతులకు ఇవేవీ తెలియవు. ముందురోజు మందు చల్లితే తెల్లారే కాయ లు కోసి మార్కెట్‌కు తరలిస్తుండడం చాలా తరచుగా జరుగుతోంది. ‘అలా కోసినా ఏం కాదు.. ఒక పూట సమయం ఉం టుందిగా..’ అని వికారాబాద్ రైతు శివారెడ్డి అమాయకంగా ప్రశ్నించారు. పొద్దున్నే మంచు కురిసినప్పుడు వాటిపై ఏం ఉ న్నా కడిగేసినట్లు అవుతాయని కొందరు రైతులు చెబుతుండ డం గమనార్హం. మార్కెట్లో కొన్ని కంపెనీలు కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు తొలగిస్తాయంటూ ఓజోన్‌ గ్యా స్‌ ఆధారంగా పనిచేసే యంత్రాల్ని విక్రయిస్తున్నారు. చాలావరకు పురుగుమందుల అవశేషాల్ని తొలగించినా… దీర్ఘకాలం లో ఈ గ్యాస్‌ మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కూరగాయల పైభాగంలోని అవశేషాలను తొలగిస్తాయని, లోపల ఉన్న వాటిపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Next Story

Most Viewed