పీఎం కిసాన్ సమ్మాన్ 8వ విడత నిధుల విడుదల

89

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.2000 డిబిటి పద్ధతిలో శుక్రవారం ఉదయం 11గంటలకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 8వ విడత చెల్లింపులను ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. నాలుగు నెలల కిందట 7వ విడత నిధులు రాగా, ఈ ఏడాదిలో రెండో విడత నిధులు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 2,63,014 మందికి రైతులకు లబ్ది చేకూరుంది. రైతుకు రూ.2000 చొప్పున ఉమ్మడి జిల్లాల రైతులకు సంబంధించిన ఖాతాల్లో రూ.52,60,28,000 ను జమ అయ్యాయి. తెలంగాణలో కోతల సీజన్‌లో కేంద్రం నిధులు కొద్దిగా రైతులకు నూర్పిడికి, కోతలకు ఉపయోగ పడనున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు వ్యవసాయ కమతాన్ని బట్టి నిర్ణీత వ్యవసాయానికి చెల్లింపులు జరుగుతుండగా, కేంద్రం ప్రతి ఏడాది మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతులకు వ్యవసాయానికి ఆరు వేలు నేరుగా రైతుల ఖాతాలో కేంద్రం జమ చేస్తోంది.

లబ్దిదారులు ఎందుకు తగ్గుతున్నారో..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేలు పోందే లబ్ధిదారుల సంఖ్య ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి తగ్గుతూ వస్తోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత 1,58,391 మంది లబ్ధిదారులు ఉండగా, ఏడవ విడతకు వచ్చే సరికి జిల్లాలో 1,04,618 మాత్రమే మిగిలారు. ఎనిమిదవ విడతకు వచ్చే సరికి తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. కేంద్రం ద్వారా రైతులకు వచ్చే సాయంలో రైతులు తగ్గడానికి గల కారణాలు తెలియరాలేదు. వ్యవసాయ శాఖాధికారులు దానికి కారణం తెలియదని చెబుతున్నారు. రెండేళ్లలో 50 వేల మంది రైతులకు దక్కకుండా పోవడంపై అధికారులు మా పరిధిలో లేదని సమాధానం ఇస్తున్నారు.

లాక్‌‌డౌన్‌లో నగదు జమపై హర్షం..

కరోనా ఆర్థిక సంక్షోభంలోనూ సమయానికి 9.5 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.19,000 కోట్లు జమ చేయటం పట్ల ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మి నారాయణలు ప్రకటనలో తెలిపారు. ఒక వైపు దేశంలో కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో సమయానికి రైతులకు అందాల్సిన కిసాన్ సమ్మాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడం హర్షించదగ్గ విషయమని, కిసాన్ సమ్మన్ నిధి రావడం హర్షనీయమని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులను జమ చేయాలని, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని చోట్ల కొనుగోలు చేసిన 20 రోజులకు కూడా రైతులకు డబ్బులు జమ కావటం లేదని జిల్లా అధికారులు చొరవ చూపి ధాన్యం తొందరగా కాంట అయ్యే విధంగా, రైస్ మిల్లులకు చేరి సకాలంలో పంట సొమ్ము రైతుల ఖాతాల్లో జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..