రివ్యూ: ‘పిట్టకథలు’- ఆమె కోణంలో ‘లస్ట్ అండ్ లవ్’

by  |

దిశ, సినిమా: మహిళ పురుషుడిని ఎంత గొప్పగా ప్రేమించగలదో అంతే స్థాయిలో ద్వేషించగలదు. ఎలా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేయగలదో.. అంతే సున్నితంగా అథ:పాతాళానికి తొక్కేయగలదు. మహిళ తలుచుకుంటే ప్రాణం పోయగలదు..తేడావస్తే ప్రాణం తీయనూగలదు. ‘స్త్రీ నిర్ణయించే వరకే అది పురుషుడి ప్రపంచం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్స్..తెలుగు ఓటీటీలో స్టాండర్డ్స్ క్రియేట్ చేయగా.. ప్రేమ, ద్రోహంతో కూడిన నలుగురు మహిళల ప్రయాణాన్ని, నాలుగు స్టోరీలతో ‘పిట్ట కథలు’గా తీసుకొచ్చింది. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఆంథాలజీ..బిగ్గెస్ట్ కాస్ట్ అండ్ క్రూతో ఆడియన్స్‌కు వీకెండ్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది.

‘రాముల’ – తరుణ్ భాస్కర్

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సెగ్మెంట్ ప్యూర్ లవ్, కన్నింగ్ పాలిటిక్స్ మధ్య రాలిపోయిన ‘రాముల’ అనే అమ్మాయి కథ. టిక్ టాక్‌తో ఫేమస్ అయిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాముల ఎక్స్ ఎమ్మెల్యే కొడుకుతో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలో ఇద్దరు తన అన్న కంటపడగా..అబ్బాయి జస్ట్ ఫ్రెండ్ అనే చెప్తాడు. దీంతో ప్రియురాలిని స్నేహితురాలిగా చెప్పుకుంటున్న అబ్బాయిని చెడామడ తిట్టేసి తర్వాత కూల్ చేసే ప్రయత్నం చేయగా..తను బ్రేకప్ చెప్పేస్తాడు. ఆ తర్వాత అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం..అధికారం, మీడియా అటెన్షన్ కోసం పాకులాడుతున్న ఫిమేల్ పొలిటిషియన్ స్వరూపక్క కంట పడుతుంది. ఇంతకీ ఆ మహిళా నేత రాములకు ఏం సజెస్ట్ చేసింది? రాముల ఆ సజెషన్ ఫాలో అయ్యాక అబ్బాయిలో ఎలాంటి మార్పు వచ్చింది? రాముల తన జీవితాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చిందనేది స్టోరి. పొలిటిషియన్‌గా మంచు లక్ష్మీ ప్రసన్న పర్‌ఫార్మెన్స్ అదిరిపోగా..రాముల క్యారెక్టర్‌లో శాన్వీ మేఘన ఒదిగిపోయింది.

‘మీరా’ – నందిని రెడ్డి

తన జోనర్‌ను క్రాస్ చేసి నందిని రెడ్డి ‘పిట్ట కథలు’ రూపంలో చేసిన ప్రయోగం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 18 ఏళ్ల ఏజ్ గ్యాప్‌తో ఉన్న మీరా(అమలాపాల్‌)ను పెళ్లి చేసుకుంటాడు విశ్వ(జగపతి బాబు). తను ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తున్నా సొసైటీ మాత్రం తన భార్య అందచందాల గురించి ప్రశంసించడం తట్టుకోలేకపోతాడు. ఏ అబ్బాయి తనతో మాట్లాడినా ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అంటూ టార్చర్ చేసేస్తాడు. ప్రతీ క్షణం ఇన్‌సెక్యూర్ ఫీల్ అయ్యే భర్త మరొకరి ధ్యాసలో ఉండకూడదని ప్రతీ పూట భార్యను లైంగికంగా వేధిస్తూనే ఉంటాడు. పదేళ్ల పాటు బాధలు భరించిన మీరా(అమలాపాల్) భర్తకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. రైటర్ అయిన తను మరొకరితో ఇల్లీగల్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీంతో భర్త మానసికంగా ఇబ్బందులకు గురి చేసి ఎలా కక్ష తీర్చుకుంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తాను మూడో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది? అనేది ‘మీరా’ కథ. జగపతి బాబు ఔట్ స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్, అమలా పాల్ ప్రతీ సీన్‌లో చూపించిన నటనా ప్రావీణ్యం ‘మీరా’ను మరో లెవల్‌లో నిలబెట్టగా.. స్త్రీ తలుచుకుంటే ఏం చేయగలదో చూపించింది ఈ పిట్ట కథ.

‘ఎక్స్ లైఫ్’ – నాగ్ అశ్విన్

ఎక్స్ లైఫ్.. అనేది గతాన్ని పరిచయం చేస్తూ మనుషులతో మనుషులకు సంబంధం లేకుండా చేసే ఓ ఫ్యూచర్ యాప్. ఈ యాప్ ద్వారా ఓ యంగ్ టాలెంటెడ్ పర్సన్ ప్రపంచంలో సగం మందిని హాల్ట్ చేసేస్తాడు. ప్రకృతికి విరుద్ధంగా మనుషులను ట్రాప్ చేసి ఆడుకుంటాడు. దీన్ని హ్యాక్ చేసి ప్రపంచాన్ని యాప్ నుంచి విడుదల చేయాలని ట్రై చేస్తున్న వారిని సైతం చంపేసే వ్యక్తిని ఓ అమ్మాయి(శ్రుతి హాసన్) ఎలా ట్రాప్ చేసింది? ఎలా హతమార్చిందినేది ‘ఎక్స్ లైఫ్’ కాన్సెప్ట్. కథ, సన్నివేశాలు రిచ్‌గా ఉన్నా..అనుకున్న సమయంలో అనుకున్నంతగా ఎలివేట్ చేయలేకపోయారు నాగ్ అశ్విన్. శ్రుతి హాసన్ తన పాత్ర పరిధిలో బాగా చేసినా..పాత్రకు మరింత ప్రాధాన్యతనిచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

‘పింకి’ – సంకల్ప్ రెడ్డి

ఈషా రెబ్బ, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ ప్రధానపాత్రల్లో సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పిట్ట కథ ‘పింకి’. ప్రజెంట్ జనరేషన్‌లో భర్త సక్సెస్ కాకపోతే డైవర్స్ తీసుకోవడం.. మరో సక్సెస్ ఫుల్ పర్సన్‌ను పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది అనేది ‘పింకి’ క్యారెక్టర్ ద్వారా సూచించాడు డైరెక్టర్. కానీ సక్సెస్ ఫుల్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా తన దగ్గర ప్రేమ దొరక్కపోతే..అప్పటికే పెళ్లి చేసుకున్న ఎక్స్ హజ్బెండ్‌తో కాంటాక్ట్‌లోకి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? తన కడుపులో మోస్తున్న బిడ్డకు మాజీ భర్త తండ్రి అయిన విషయం..అటు తన భార్యకి, ఇటు తన భర్తకి చెప్పిన పింకి తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది. ఇంతటి గజిబిజి సిచ్యువేషన్స్‌కు కారణం ఎవరు? ఏంటి? అనేది ‘పింకి’ సెగ్మెంట్‌లో వివరించాడు సంకల్ప్ రెడ్డి.

Next Story