శాంతి క‌పోతాలతో పెను ముప్పు

by  |
శాంతి క‌పోతాలతో పెను ముప్పు
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: శాంతి క‌పోతాలు ప్రజ‌ల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారాయి. పావురాలు ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారులు కాగా, ప్రస్తుతం ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి వాహకాలుగా మారాయి. అందమైన పావురాల వెన్నంటే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్​లు దాగి ఉంటాయి. వాటి రెట్ట, రెక్కల నుంచి వచ్చే గాలి ఎంతో ప్రమాదకరం. అస్తమా, మ‌ధుమేహ వ్యాధి గ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పావురాల ద్వారా సుమారు 60 ర‌కాల జ‌బ్బులు వచ్చే అవ‌కాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పావురాల విసర్జకాలు అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండిన రెట్ట నుంచి ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాలిలో కలిసి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. పావురాలను ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. హైద‌రాబాద్ వంటి విశ్వ న‌గ‌రంలో ఖాళీగా ఉన్న భ‌వ‌నాల్లో పావురాలు గూడు క‌ట్టుకుని ఉండ‌డం స‌హ‌జంగా క‌న‌బ‌ డుతుంటాయి. ఇవి గ‌దుల్లో వేసే రెట్ట కార‌ణంగా గ‌ది లోని వాతావ‌ర‌ణం కాలుష్యంగా మారుతుంది.

చాలా రోజుల త‌ర్వాత గ‌ది త‌లుపులు తెరిస్తే కొద్ది స‌మ‌యం ఇంట్లోకి వెళ్లకుండా ఉండ‌డం మంచిది. కొన్ని ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లలోనే కాకుండా నివాస‌ముంటున్న ఇండ్లలోకి కూడా పావురాలు వ‌స్తుంటాయి. ప‌క్షి ప్రేమికులు ఇవి గూడు క‌ట్టుకున్నా ఏమీ అన‌రు. ఇటువంటి వారు ఆరోగ్యంపై అప్రమ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. అపార్ట్ మెంట్లలో ప్లాట్ల మ‌ధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా ఇవి గూడు క‌ట్టుకుంటాయి. ఇవి వేసే రెట్ట ఎండిన అనంత‌రం ఏసీ ద్వారా గ‌దుల్లోకి వెళ్తుంటాయి. ఈ గాలిని పీల్చడంతో ప్రజ‌లు రోగాలబారిన ప‌డుతున్నారు.

పావురం జీవిత కాలం 12 యేండ్లు…

పావురాల జీవిత కాలం 12ఏళ్లు. ఓ పావురాల జంట ఏడాదికి 18 పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పావురాలు వ్యాధులను మోసుకొస్తున్నాయి. వీటి రెట్ట, రెక్కలు, ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాప్తి చెందుతా యి. ఆ గాలిని పీల్చడంతో వ్యాధులు త‌ప్పవు. వీటి రెక్కలు, రెట్టలను ముట్టుకోకూడదని, తాకితే చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్తగా ఉండాలి…

పావురాల కార‌ణంగా ప్రజ‌ల్లో తీవ్ర అనారోగ్య స‌మ‌స్యలు త‌లెత్తుతాయి. వీటి రెట్ట చాలా ప్రమాద‌క‌రం. హైద‌రాబాద్‌లో పావురాల కార‌ణంగా జ‌బ్బులు పెరుగుతున్నాయి. అస్తమా, మ‌ధుమేహ వ్యాధి గ్రస్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి ద్వారా హిస్టోప్లాస్మాసిస్, క్రిప్టో కోకోసిస్ , సిట్టా కోసిస్ వంటి ఫంగ‌ల్ ఇన్ఫెక్షన్లు వ‌స్తాయి. వీటి రెక్కల ద్వారా వ‌చ్చే గాలి కూడా కాలుష్యమే. –డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఫిజీషియ‌న్, ఉస్మానియా హాస్పిట‌ల్



Next Story