ఆ ఆస్పత్రిలో ఫార్మాసిస్టులతో నీళ్లు, టీ మోయిస్తున్రు

by  |
ఆ ఆస్పత్రిలో ఫార్మాసిస్టులతో నీళ్లు, టీ మోయిస్తున్రు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో ఫార్మాసిస్టులే వార్డుబాయ్ పనులు చేస్తున్నారు. నగరంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ ఆస్పత్రిని ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్‌గా గుర్తించి కరోనా రోగులకు సేవలందిస్తోంది. కాగా, ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో జిల్లాల నుంచి వైద్య సిబ్బందిని తీసుకొచ్చి డిప్యుటేషన్‌పై డ్యూటీ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ఆయుర్వేదిక్ ఆస్పత్రుల నుంచి ఫార్మసిస్టులను హాస్పిటల్ లో పని చేయడానికి కేటాయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇలా డిప్యుటేషన్ పై పనిచేసే ఫార్మాసిస్టులతో రోగులకు మందులు ఇప్పించకుండా అటెండర్, వార్డుబాయ్ పనులు చేయించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ స్థాయికి తగ్గ విధులు కేటాయించాలని ఫార్మాసిస్టులు ఆస్పత్రి పాలక వర్గాన్ని వేడుకున్నా పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీళ్లు, టీ మోయిస్తున్నారు….

ఫార్మాసిస్టులతో వార్డుల్లో రోగులకు నీళ్లు, టీ పోయడం, వార్డులను శుభ్రం చేయించడం వంటివి చేయిస్తున్నారు. మేం ఏ పని చెప్తే ఆ పని చేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బెదిరిస్తున్నట్లు వారు వాపోతున్నారు. జిల్లాల లోని ఆయుర్వేదిక్ ఆస్పత్రుల్లోని ఫార్మసీలకు తాళం వేసినట్టు చెప్పారు. ఇప్పటికైనా సూపరింటెండెంట్ తమ తీరు మార్చుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.



Next Story