గిరిజన మహిళపై దాడి.. RS ప్రవీణ్ కుమార్ కి వినతిపత్రం

388

దిశ, కల్లూరు(ఖమ్మం): పాలకుల విధానాలను ప్రశ్నించడం పాపం కాదని, విమర్శించడం నేరం కాదని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పి ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోత్ బద్రు నాయక్ , జిల్లా అధ్యక్షుడు ధర్మ సోత్ దశ రత్ నాయక్ ,జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ఆరోపణలు, కామెంట్లపై ప్రభుత్వాలు పెడుతున్న కేసుల అంశంలో సుప్రీం కోర్టు పై విధంగా స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలం తిమ్మి నాయుడు పాలెం గ్రామంలో నివసిస్తున్న ఎస్టీ లంబాడి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భానోతు ఝాన్సీ పై ఖమ్మం టూ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. పోడు భూములు ఉద్యోగుల అంశంపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన ఫేస్‌బుక్‌లో పెట్టిన విమర్శలపై టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు ఖమ్మం టూ టౌన్ లో ఫిర్యాదు చేయగా, వెంటనే కేసు నమోదు చేయడం గమనించాల్సిన విషయం అన్నారు. ఇది ఇటీవల జరిగిన వ్యవహారమని ఖమ్మం టూ టౌన్ లో ఎస్టీ మహిళ పట్ల ఏసీపీ ఆంజనేయులు అనుచిత ప్రవర్తన ఖండించదగ్గ విషయమన్నారు. ఆమెను అవమాన పరచడమే కాకుండా ఉద్యోగం పీకేస్తామని భయభ్రాంతులకు గురిచేయడం బాధ్యతారాహిత్యం అన్నారు.

ఎస్టీ లంబాడి వర్గానికి చెందిన వ్యక్తి అని కూడా చూడకుండా దుర్భాషలాడటం, అవమానకరంగా మాట్లాడటం చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన బద్రు నాయక్ ను సైతం అవమానపరిచే విధంగా ఏసీపీ ప్రవర్తించడం సమంజసం కాదన్నారు.  ఇటువంటి అనైతిక, అనాగరిక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఏసీపీ ఆంజనేయలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ సీఐ అంజలిపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో  ఇతర ప్రజా సంఘాలతో కలిసి దశలవారీ ఆందోళనలు కార్యక్రమాలను చేపడతాయని ప్రకటించారు.  పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి, బాధిత గిరిజన మహిళను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా దీనిపై బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ కు భానోతు ఝాన్సీ వినతిపత్రం అందించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.