‘పెన్ ఉరుప్పు’.. వేల కళ్ల కామానికి బలైన ‘స్త్రీ’ కథ

by  |
‘పెన్ ఉరుప్పు’.. వేల కళ్ల కామానికి బలైన ‘స్త్రీ’ కథ
X

దిశ, వెబ్‌డెస్క్: దేవుడిచ్చిన వరం ఆ అమ్మాయికి శాపమైందా? మనుషుల మనసును చదివేయడంలో తనకున్న శక్తి.. ఈ సమాజంపై వెగటు పుట్టేలా చేసిందా? టీనేజ్ కుర్రాళ్ల నుంచి కాటికి కాళ్లు చాపుకున్న ముసలాడి వరకు ఓ ఆడపిల్లపై తమ మనసులో వ్యక్తం చేసిన కోరికలే తనను బలితీసుకున్నాయా? అనేది పెన్ ఉరుప్పు(ఫిమేల్ ఆర్గాన్) షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్. ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటకొచ్చిందంటే చాలు.. కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్లను దాటుకుని వెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఫిల్మ్ మేకర్స్. సొసైటీలో ప్రతీ ఒక్కడు అమ్మాయిల పట్ల రాంగ్ ఇంటెన్షన్‌తోనే బతికేస్తున్నాడని.. తన ఆలోచనల్లోనే అమ్మాయిని రేప్ చేస్తున్నాడనే సత్యాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ లోకంలో ప్రతీది దేవుడి సృష్టే అయినా, మనిషికి జన్మనిచ్చేది స్త్రీమూర్తి. అప్పుడు ఆమె కూడా దైవస్వరూపమే. నీ తొలి ఆకలి తీర్చేది తన అవయవమే.. నీకు తొలి స్నానం ఆమె కాళ్ల మీదే.. నువ్వు తొలి అడుగులు వేసేది తన గుండెల మీదే.. తొలిగా కూర్చునేది తన ఒడిలోనే.. అసలు నువ్వు పుట్టింది కూడా ఆ మాతృమూర్తి అవయవాలను పంచుకొనే. మరి అలాంటి స్త్రీ రోడ్డు మీద నడిస్తుంటే, మగ పురుగులు ఎలా చూస్తున్నారు? ఎలా చూడకూడదు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ‘పెన్ ఉరుప్పు’.

కథ:

మలార్ అనే ఓ మాటలు రాని అమ్మాయి.. ప్రతీ రోజు దేవుడిని పూజిస్తుండగా, తన పూజలను మెచ్చి ఓ వరం ఇస్తాడు. అయితే అది కూడా అలాంటి ఇలాంటి వరం కాదు, ఎదుటి మనిషి తన మనసులో ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకునే వరం. దేవుడు అలా వరమివ్వగానే చాలా సంతోషంగా బయటకెళ్లిన మలార్.. ఓ బుక్ షాప్‌కు వెళ్తుంది. మలార్ పుస్తకం అడగడాన్ని అర్థం చేసుకోలేకపోయిన ఆ షాప్ యజమాని ‘ఇంత అందంగా ఉన్న మలార్‌కు దేవుడు మాటలు ఎందుకివ్వలేదు’ అని మనసులోనే అనుకుంటాడు. ఆయన పాజిటివ్ థాట్‌కు సంబరపడిపోయిన అమ్మాయి.. అతడి మాటలను నోట్ బుక్‌లో రాసుకుంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తుండగా.. ఓ చిన్న పిల్లాడు తన బ్యాగ్‌కు ఉన్న కీ చైన్ చూసి ముచ్చటపడతాడు. వెంటనే ఆ బుడ్డోడికి కీ చైన్ ఇచ్చేసి.. ఆ ఇన్సిడెంట్ కూడా నోట్ చేసుకుని ముందుకు సాగుతుంది. అక్కడ ఎదురైన ఓ ఆటోవాలా.. ‘ఇది వెనక నుంచి చూస్తేనే ఇంత బాగుంది, ముందు నుంచి చూస్తే ఇంకెలా ఉంటుందో’ అనే మనసులోనే అనుకుంటాడు. ఆ తర్వాత దీంతో ఒక్క రోజు గడపకపోతే జీవితం ధన్యం కాదేమో అనుకుంటున్న ఓ ముసలోడి కామెంట్‌కు చాలా ఏడుస్తుంది. ఇవి తట్టుకోలేక ఆటో ఎక్కితే, అందులో ఉన్న ముగ్గురు మగ వెధవలు కూడా.. ‘వాట్ ఏ స్ట్రక్చర్? పిల్ల పక్కనే ఉన్నా ఏం చేయలేకపోతున్నానే.. వెహికల్‌లో ఎవరూ లేకపోతేనా? అన్న మాటలు తనను మరింత కుంగదీస్తాయి. ఆటో దిగాక తన క్లోజ్ ఫ్రెండ్‌ను పట్టుకుని ఏడుస్తుంటే, అతను కూడా ఈ ఇన్సిడెంట్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని రూమ్‌కు తీసుకెళ్లాలని అనుకుంటాడు. అడుగడుగునా కూడా ఇలాంటి ఘటనలే ఎదురుకావడంతో.. ఇంటికి చేరుకున్న తనకు తండ్రి ఓదార్పు దొరుకుతుందేమోనని ఆశపడుతుంది. కానీ ఆ సమయంలో స్టెప్ ఫాదర్ డర్టీ థాట్స్‌కు పాపం మలార్ తట్టుకోలేకపోతుంది. పెంచిన తండ్రి.. నమ్మిన స్నేహితుడు.. సమాజంలో ప్రతీ మగాడు కూడా తనను అలాగే చూస్తున్నారని తెలిసి గుండె ముక్కలై చనిపోతుంది.

మలార్‌కు దేవుడు ఇతరుల మైండ్ చదివే వరం ఇచ్చాడు కాబట్టి, వేయి రాబందులు మగ మృగాల రూపంలో సొసైటీలో తిరుగుతున్నాయని తెలుసుకోగలిగింది. కానీ అందరు మహిళలకు ఆ అవకాశం లేదు కదా.. అందుకే ఈ సినిమా ద్వారా జాగ్రత్తలు చెప్పారు. సమాజంలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. ఇప్పుడున్న సమాజంలో కన్నతండ్రిని కూడా నమ్మలేమని చెప్పారు.

అరుణ్ మిజో డైరెక్షన్‌లో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘పెన్ ఉరుప్పు’లో లీడ్ క్యారెక్టర్‌లో నటించిన పూజ ప్రశంసలు అందుకుంటుండగా.. ఫిల్మ్ మేకర్స్‌కు సెల్యూట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి కథలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed