సీల్డ్ కవర్‌లో ‘పీసీసీ’ పేరు.. అతనే కన్ఫామ్!

by Anukaran |   ( Updated:2020-12-12 06:03:40.0  )
సీల్డ్ కవర్‌లో ‘పీసీసీ’ పేరు.. అతనే కన్ఫామ్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తంతు పూర్తయ్యిందా ? ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసిన నేతలు సక్సెస్ అయ్యారా! ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌ ఎవరి పేరును ప్రమోట్ చేశారు? ఇప్పటికే హైదరాబాద్ గాంధీభవన్‌ రిపోర్టుపై విశ్లేషించిన సోనియా, రాహుల్‌ పీసీసీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పబోతున్నారంటే.. ముందువరుసలో కోమటిరెడ్డి, రేవంత్, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి పేర్లు వినపడుతున్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కాగా పీసీసీ అధ్యక్షుడి పేరును సోనియా, రాహుల్ ఇప్పటికే డిక్లేర్ చేశారని, ఆల్రెడీ ఆ పేరు సీల్డ్‌ కవరులో ఒదిగిపోయిందని, రేపో మాపో ప్రకటనే తరువాయి అన్న చందంగా సంకేతాలు వెలువడుతుండటం విశేషం.

10రోజుల క్రితం ఉత్తమ్ రాజీనామా చేసినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లే ప్రధానంగా వినిపించినా.. మాణిక్యం ఠాగూర్ వరుస సమావేశాలతో శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి పేర్లు కూడా తెరమీదికొచ్చాయి. ఇదేక్రమంలో తాను సైతం పీసీసీ రేసులో ఉన్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌లో పీసీసీ హీట్ పెరిగి.. రాష్ట్రానికి చెందిన సీనియర్ లీడర్లు ఢిల్లీ వర్గాల ద్వారా పైరవీలు మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి పేరు జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు నుంచే వినపడుతున్నా, తీరా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో నిమగ్నమైన సమయంలో ఆయన పేరు వినపడకపోవడం గమనార్హం. ఇదేక్రమంలో రేవంత్ పేరును సీనియర్లు వ్యతిరేకించడంతో మరింత డిలే అవుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఓ అడుగు ముందుకేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి… షెడ్యూల్ సైతం రాని నాగార్జునసాగర్‌ ఉపఎన్నికపై ఎగరబోయేది కాంగ్రెస్ జెండాయేనని స్పష్టం చేయడం, పార్టీలోని ఓ సీనియర్‌ వర్గం మొత్తం ఆయనవైపే మొగ్గు చూపడం అధిష్ఠానానికి కొద్దిగా తలనొప్పిగా మారింది. ఇదేక్రమంలో వాళ్లిద్దరి పేర్లను పక్కన పెట్టిన హైకమాండ్.. సీనియర్ నేత వీహెచ్, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి పేర్లను పరిశీలిస్తుండటంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే తమ నేతకు పీసీసీ కట్టబెడితే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని అనుచరులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేస్తుండటం, గట్టిగా పోటీ ఇస్తున్న నేతపై వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం గాంధీభవన్‌ పంచాయతీలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

మాణిక్యం ఠాగూర్‌ ఇప్పటివరకు తను సేకరించిన అభిప్రాయాలతో కూడిన రిపోర్టును సోనియా, రాహుల్‌‌కు ఇచ్చారని.. ఆ రిపోర్టు ఆధారంగా ఇప్పటికే పీసీసీ ఎంపిక పూర్తి చేశారన్న ఊహాగానాలు సైతం వినపడుతున్నాయి. ఇక పీసీసీ అధ్యక్షుడి పేరును ప్రకటించాక వచ్చే అసంతృప్తిని చల్లార్చడానికే ఓసారి నేతలతో మాట్లాడటమా లేకుంటే అందర్నీ ఢిల్లీ పిలిపించి నచ్చజెప్పడమా? అన్నదానిపై ఢిల్లీ వర్గాలు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పీసీసీ పీఠం మొత్తం కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి చుట్టూనే తిరుగుతుండటంతో సోనియా, రాహుల్ వీరిద్దరిలో ఒకరి పేరునే కన్ఫామ్ చేశారా? లేకుంటే అసంతృప్తులకు తావు లేకుండా అందరితో కలిసిపోయే లీడర్‌ను ఎంపిక చేశారా? అన్నది అటు కాంగ్రెస్ లీడర్లతో పాటు పొలిటికల్ సర్కిళ్లల్లోనూ ఉత్కంఠను రేపుతోంది.

Advertisement

Next Story