పిల్లల కదలికలపై తల్లిదండ్రుల దృష్టి సారించాలి

by  |
ACP Mahesh
X

దిశ, తాండూరు : నేరరహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ శాఖ అహర్నిశలు కృషిచేస్తోందని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. తాండూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఎక్కువగా గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. చాలామంది నిత్యం సెల్ ఫోన్ లతోనే గడుపుతూ ఆన్ లైన్ జూదం, పబ్జిగేమ్, క్రికెట్ బెట్టింగ్, అశ్లీల చిత్రాలకు ఆకర్షితులై తమ బంగారు జీవితాని నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

పిల్లల కదలికలపై వారి తల్లిదండ్రులు నిఘా పెట్టి మత్తు పదార్థాలు, గంజాయి తదితర చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి, క్రిమినల్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా పై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని పేర్కొన్నారు.

గంజాయి కేసులో నిందితుడి అరెస్టు

కన్నెపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన దందేరా రాజన్నను గంజాయి నిల్వ, సరఫరా కేసులో అరెస్టు చేసినట్లు ఏసీపీ మహేష్ చెప్పారు. రాజన్న ఇంట్లో గంజాయి ఉందన్న సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. సంచిలో దాచిన 920 గ్రాముల గంజాయి పోలీసుల తనిఖీల్లో దొరికిందన్నారు. కన్నెపల్లి రాంచందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

గంజాయిని, నిందితుడిని పట్టుకున్న తాండూర్ సీఐ బాబురావు, ప్రశాంత్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ లక్ష్మణ్, అశోక్ లను ఏసీపీ అభినందించారు. గంజాయిని ఎవరైన సేవించినా, అమ్మినా, కొనుగోలు చేసినా స్థానిక పోలీసులకు, డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ చెప్పారు.



Next Story

Most Viewed