ఆ 40 లక్షల మందికి సబ్సిడీ బియ్యం సమకూరేదెలా?

by  |
ఆ 40 లక్షల మందికి సబ్సిడీ బియ్యం సమకూరేదెలా?
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్‌తో కొందరికి విలాసాలు దూరమైతే.. మరికొందరికి ప్రాణాలే దూరమవుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తేసేవరకు బతుకుతామా? చస్తామా? అనే సందిగ్ధావస్థలో బడుగు జీవులు కాలాన్ని నెట్టుకొస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో నెలలపాటు సరిపడే సరుకులు, ఆహార నిల్వలు ఎలాగూ ఉండవు. ఉన్నపళంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో దాదాపు నెల రోజులుగా వారు చీకటి భవిష్యత్తును ఆలోచిస్తూ గడుపుతున్నారు. లాక్‌డౌన్ కాలాన్ని వెళ్లదీసేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సహకారాన్ని, ఆహార ధాన్యాలను అందిస్తాయని ప్రకటించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అదనంగా బియ్యం గింజలను అందించాయి. ‘ఏమయ్యా.. కేవలం బియ్యంతో పూట గడుస్తుందా?.. కంచంలోకి ఇంకేం కావాలో తెల్వదా?’ అంటూ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ స్వస్థలంలో ఉండి రేషన్ కార్డు ఉన్నవాళ్ల పరిస్థితి. వలస కార్మికుల బాధలు వేరు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌ లేదా రిలీఫ్ సెంటర్‌లలో ఆహారం సరిపడా దొరకడం లేదని ఢిల్లీలో ఓ చెత్తకుప్ప దగ్గర అరటి పండ్లను ఏరుకుంటున్న ఓ వలసకార్మికుడు వాపోతూ చెప్పాడు. ఇవన్నీ బయటకు కనిపిస్తున్న కష్టాలు.. కానీ, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంతో దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది జాతీయ ఆహార భద్రత చట్టం 2013కి అర్హులై కూడా లబ్దిదారులు కాకుండా పోయారు. ఇటు పనిలేక.. అటు సర్కారు ప్రకటించిన ఆహార ధాన్యం అందని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

39.79 లక్షల మందికి.. సబ్సిడీ ధాన్యం ఎండమావే!

పేదలు, అట్టడుగువర్గాలకు ఆహార ధాన్యాలను సబ్సిడీలో అందించాలన్న లక్ష్యంతో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ), 2013 రూపొందిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 75 శాతం గ్రామీణులకు, 50శాతం పట్టణ ప్రాంతాల్లోని బడుగులకు(2011 జనాభా లెక్కల ప్రకారం) ఈ పథకాన్ని వర్తించేలా కేంద్రం సూచించింది. రాష్ట్రాల వారీగా ఈ సంఖ్యను సూచిస్తుంది. ఆయా రాష్ట్రాలు నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా లబ్దిదారులను గుర్తించాల్సి ఉంటుంది. కానీ, గత ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రాలు సుమారు 40 లక్షల మంది లబ్దిదారులను గుర్తించడంలో విఫలమయ్యాయి. లేదా జాప్యం వహిస్తూనే ఉన్నాయి. ఈ పథకం కింద అందరికి సమానంగా నామమాత్రపు ధరకు బియ్యం, గోధుమలు ఇతర ఆహార ధాన్యాలను సర్కారు అందిస్తుంటుంది. ఎన్ఎఫ్ఎస్ఏ కిందనే లబ్దిదారులను గుర్తించేందుకు రేషన్ కార్డులను జారీ అవుతాయి. ఇందులో అంత్యోదయ కార్డులూ ఉంటాయన్న సంగతి తెలిసిందే.

యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్.. తాజా(ఏప్రిల్ 15వ తేదీనాటికి) సమాచారం ప్రకారం.. ఎన్ఎఫ్ఎస్ఏ కింద 81.35 కోట్ల మందిని యాక్సెప్ట్ చేయగా.. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు 80.95 కోట్ల మందినే గుర్తించాయి. అంటే, 39.79 లక్షల మంది ఈ పథకానికి లబ్దిదారులు ఎన్ఎఫ్ఎస్ఏకు దూరమయ్యారు. బీహార్ ప్రభుత్వం 8.71 కోట్లకు గాను.. 8.57 మంది లబ్దిదారులను మాత్రమే గుర్తించింది. అంటే దాదాపు 14.04 లక్షల మందిని ఎన్ఎఫ్ఎస్ఏకు దూరంగా ఉంచినట్టయింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ తేడా ఎనిమిది లక్షల మంది, తమిళనాడులో 7.36 లక్షల మంది, ఒడిశాలో 2.61 లక్షల మంది, ఛండీగడ్‌లో 2.17 లక్షల మంది లబ్దిదారులు ఈ పథకానికి అర్హులై కూడా లబ్దిదారులుగా మారలేకపోయారు. అయితే, 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తేడా శూన్యంగా ఉండటం గమనార్హం.

గరీబ్ కళ్యాణ్‌కూ దూరమే..!

లాక్‌డౌన్ కాలంలో కేంద్రం 1.76లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీలో భాగంగానే ‘పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కిందే తర్వాతి మూడు నెలల కోసం లబ్దిదారులైన వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాన్ని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ ధాన్యాన్ని ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నది. ఇప్పటికే ఈ సహాయాన్ని లబ్దిదారులు పొందుతున్నారు. ఈ అదనపు కోటాను పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ఇంకా అమలు చేయలేదని సమాచారం. కష్ట కాలంలో కేంద్రం ప్రకటించిన ఈ రిలీఫ్ ప్యాకేజీకీ పైన పేర్కొన్న 39.79 లక్షల మంది నోచుకోలేకపోయారు. ఎందుకంటే వీరు ఎన్ఎఫ్ఎస్ఏ లబ్దిదారులు కాకుండా పోయారు కాబట్టి. లాక్‌డౌన్‌ కష్టకాలంతోనే ఉపాధికి దూరమై బతుకు భారమవుతున్న ఈ ప్రజలకు.. ప్రభుత్వం ప్రకటించిన ఆ కాస్త ఊరట కూడా ఎండమావిగానే మారింది.

Tags.. nfsa, food security act, rice, relief package, garib kalyan yojana



Next Story

Most Viewed