మావోయిస్టు రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ

by  |
మావోయిస్టు రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దడమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని డీజీపీ డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి 2020 ఏడాది నివేదికను ఆయన బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…. ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలను చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. టెక్నాలజీని ఒక ఫోర్స్ గా వినియోగిస్తూ స్మార్ట్ పోలీస్ వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మావోయిస్టులతో 11 ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, అందులో 11 మంది మావోయిస్టులు చనిపోయారని అన్నారు. ఈ సందర్భంగా 135 అరెస్టు చేయగా, అందులో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, 4 గురు జిల్లా కమిటీ సభ్యులు, 4 ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. ఈ ఏడాదిలో ఎలాంటి ప్రధానమైన హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకోకుండా నివారించడంలో సక్సెస్ అయ్యామన్నారు. అంతే కాకుండా గతేడాది కంటే కన్వెక్షన్ రేట్ 19 శాతం పెరిగినట్టు తెలిపారు.

6 శాతం తగ్గిన నేరాలు..
రాష్ట్ర వ్యాప్తంగా 6.65 లక్షల సీసీ కెమెరాల ఉన్నట్టు తెలిపారు. వీటిలో ఈ ఏడాది 99 వేల సీసీ కెమెరాలను 2020లో అమర్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సీసీ టీవీ కెమెరాలను అమర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని అన్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజీల ద్వారా దాదాపు 4490 కేసులను గుర్తించినట్టు డీజీపీ తెలిపారు. ఫింగర్ ప్రింట్ ద్వారా 300, టెక్నాలజీ ద్వారా 3100 మంది అనుమానితులను గుర్తించాన్నారు. ముఖ్యంగా పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో 22 మంది నేరస్థులను కనుగొన్నట్టు తెలిపారు. ఇదంతా టెక్నాలజీ ఆధారంగానే గుర్తించినట్టు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 1,50,922 కేసులు నమోదు కాగా, గతేడాది మొత్తం 1,60,571 కేసులు నమోదైనట్టు తెలిపారు. వీటిలో 53,971 ఐపీసీ, 30,277 సీఆర్పీసీ, 7631 స్పెషల్ అండ్ లోకల్ లా, 14,698 మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నారు. మొత్తంగా గతేడాది కంటే ఈ ఏడాది 6 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. దర్పణ్ యాప్ ద్వారా మొత్తం 33 మంది తప్పిపోయిన పిల్లలను గుర్తించగా, అందులో 19 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు, 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు తెలిపారు. ఈ ఏడాది 350 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేశామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 21 శాతం తగ్గినట్టు తెలిపారు.

మహిళలపై పెరిగిన అత్యాచారాలు..
గతేడాది కంటే ఈ ఏడాది అన్ని రకాల నేరాలలో క్రైమ్ రేట్ తగ్గినా, మహిళలపై అత్యాచారాలు మాత్రం పెరిగాయి. మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించి 2019లో 15,143 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 14,853 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కానీ, అత్యాచారం కేసులు గతేడాది 1780 నమోదు కాగా, ఈ ఏడాది 1934 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గతేడాది 1890 కేసులు నమోదు అవ్వగా, ఈ ఏడాది 2096 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎస్సీఎస్టీ లకు సంబంధించిన మహిళలపై అత్యాచారం కేసులు గతేడాది 220 ఉండగా, ఈ ఏడాది 265కు పెరిగాయి. అయితే, ఈ 265 కేసులలో 89 మంది ప్రేమ కారణంగా పారిపోయారని, సాంకేతికంగా కేసు నమోదు చేయాల్సి వచ్చినట్టు పేర్కొనడం గమనార్హం. డయల్ 100, ఫేస్ బుక్, ట్విట్టర్, హాక్ ఐ, మెయిల్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా 4855 ఫిర్యాదులు అందాయి. షీ టీమ్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులలో వేధింపులకు గురయ్యే వారు దాదాపు 89 శాతం మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారే ఉంటున్నారు. వీరిలో 96 శాతం మంది షీ టీమ్స్ ద్వారా సేవలను అభినందించినట్టు తెలిపారు.

103 శాతం పెరిగిన సైబర్ క్రైమ్..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టగా, సైబర్ నేరాలు మాత్రం రెట్టింపు స్థాయిలో 103 శాతం పెరిగాయి. ఈ ఏడాది 2020లో మొత్తం 4544 సైబర్ నేరాలు నమోదు కాగా, గతేడాది 2240 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఆర్థికపరమైన నేరాలు గతేడాది 9609 కేసులు కాగా, ఈ ఏడాది 9568 కేసులు నమోదయ్యాయి. గతేడాది కంటే 41 కేసులు తగ్గాయి. రకరకాల సోషల్ మీడియ యూనిట్ల ద్వారా 1.59 లక్షల ఫిర్యాదులను అటెండ్ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ లోన్ యాప్ వేధింపులలో మొత్తం 50 కేసులు నమోదు కాగా, 27 గురిని అరెస్టు చేశామన్నారు.

Next Story

Most Viewed