షాపులు ఓపెన్.. కండిషన్స్ అప్లై

by  |
షాపులు ఓపెన్.. కండిషన్స్ అప్లై
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ నాలుగో దశ సడలింపులతో అన్ని షాపులూ తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ పట్టణాభివృద్ధిశాఖ మర్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా ఇతర అన్ని చోట్ల షాపులు ఓపెన్ చేసుకోవచ్చని సూచించింది. అయితే కొన్ని షరతులు మాత్రం విధించింది. బట్టల షాపులు, నగల దుకాణాలు, చెప్పుల షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతి నిరాకరించింది. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి లేదు. కానీ, కార్యకలాపాలకు ఒకే చెప్తూ.. టేక్ అవే, హోం డెలివరీలకు అంగీకరించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే షాపులు తెరిచేందుకు అనుమతినిచ్చింది. మెడికల్ షాపులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. తెరిచిన షాపుల్లో పనిచేసే సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలని, చేతులను విరివిగా శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. మొత్తం స్టాఫ్‌లో సగం మంది మాత్రమే విధుల్లో ఉండాలని చెప్పింది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, లిఫ్టులు, వర్కింగ్, పార్కింగ్ ప్రదేశాలను శానిటైజ్ చేయాల్సిందేనని ఆదేశించింది.

వాష్ రూమ్‌లు గంటకోసారి క్లీన్ చేయాలి
ఆయా సంస్థలు లేదా షాపుల్లోని మరుగుదొడ్లను గంటకు ఒకసారి క్లీన్ చేయాలని, సిబ్బందికి సరిపడా శానిటైజర్లు, టిష్యూ పేపర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పింది. షాపుల నిర్వాహకులు, సిబ్బంది విధిగా ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని షరతు విధించింది. కటింగ్ షాప్‌లకు వచ్చే వారికి టచ్ లెస్ థర్మోమీటర్ల ద్వారా ఉష్ణోగ్రతలను పరీక్షించాలని చెప్పింది. షాపులో ప్రతి వినియోగదారుడి పేరు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. ఇందుకోసం రిజిస్టర్ మెయింటైన్ చెయ్యాలని తెలిపింది. కస్టమర్లకు కప్పే వస్త్రాలు, పరికరాలు, అన్నింటినీ డిస్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతే వినియోగించాలని సూచించింది. వినియోగదారుడే టవల్ పట్టుకెళ్తే మంచిదని చెప్పింది. భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించేలా షాపు యజమానులే చూడాలని తెలిపింది. ఈ నిబంధనలు పాటించని పక్షంలో శిక్షార్హులని జీవోలో స్పష్టం చేసింది.

Next Story

Most Viewed