క్రిస్మస్ రోజు జరిగిన టెస్టు మ్యాచులెన్నో తెలుసా..?

by  |
క్రిస్మస్ రోజు జరిగిన టెస్టు మ్యాచులెన్నో తెలుసా..?
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌లో పుట్టిన క్రికెట్.. కామన్వెల్త్ దేశాల్లో చాలా విస్తృతంగా వ్యాపించింది. టెస్టు క్రికెట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విదేశీ పర్యటనలు కూడా ఊపందుకున్నాయి. అయితే క్రికెట్ ఇంగ్లాండ్‌లో పుట్టినా క్రిస్మస్ రోజు మాత్రం మ్యాచ్‌లు ఆడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇండియాలో దీపావళి, దసరా, హోలీ వంటి పండుగల సమయంలో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. కానీ క్రికెట్ చరిత్రలో క్రిస్మస్ రోజు క్రికెట్ ఆడటం అనేది చాలా అరుదైన విషయమే. 1951లో అడిలైడ్‌లో తొలి సారిగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య క్రిస్మస్ రోజు టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ టెస్టులో మూడవ రోజు క్రిస్మస్ వచ్చింది. అయితే వెస్టిండీస్ మూడో రోజే అంటే క్రిస్మస్ రోజే మ్యాచ్ గెలిచేసింది.

1967లో అదే అడిలైడ్‌లో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ క్రిస్మస్ రోజు జరిగింది. రెండేళ్ల తర్వాత 1969లో మద్రాస్ (ఇప్పుడు చెన్నయ్) వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా మధ్య మరోసారి క్రిస్మస్ టెస్ట్ జరిగింది. ఇక చివరి సారిగా 1972లో క్రిస్మస్ టెస్టు జరిగింది. ఢిల్లీలో ఇంగ్లాండ్ – ఇండియా మధ్య ఈ మ్యాచ్ జరుగగా పర్యాటక ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఎన్నడూ క్రిస్మస్ రోజు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించలేదు. ఆ తర్వాత బాక్సింగ్ డే (క్రిస్మస్ తర్వాతి రోజు/డిసెంబర్ 26) టెస్టు మ్యాచ్ ఆడటం ఆనవాయితీగా మారింది. బాక్సింగ్ డే టెస్టు అనగానే అందరికీ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ గుర్తుకు వస్తుంది. అక్కడే బాక్సింగ్ డే టెస్టు జరుగుతుంది. అయితే ఆ తర్వాత కాలంలో దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్, న్యూజీలాండ్‌లోని బేసిన రిజర్వ్‌లో కూడా ఆడుతున్నారు.

Next Story