ఈ రాష్ట్రాల్లో మాస్కులు మ్యాండేటరీ

by  |

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్ విధించినా.. నిత్యావసర సరుకులు, ఔషధాల కొనుగోలులాంటి అత్యవసరాలకు ప్రజలు బయటికెళ్లేందుకు అనుమతి ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ప్రజలు బయటికెళ్లుతున్న సందర్భాలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటికెళ్లితే మాస్కులు తప్పక వాడాలన్న నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇంటి బయట అడుగుపెట్టినప్పుడు ప్రజలు తప్పకుండా మాస్కు పెట్టుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రజలను కోరాయి. కొన్ని రాష్ట్రాలైతే.. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే లీగల్ చర్యలకూ ఆదేశించిన రాష్ట్రాలున్నాయి.

ముంబయి, యూపీల్లో మాస్కు లేకుంటే లీగల్ చర్యలు..

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అడుగుబయట పెడితే మాస్కులు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ గ్రేటర్ ముంబయి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పర్దేషి ఆదేశించారు. అత్యావసరాల కోసం బయటికి వచ్చినప్పుడే కాదు.. వాహనాల్లో ఉన్నప్పుడూ మాస్కులు ధరించాలని మున్సిపల్ బాడీ ఆదేశించింది. బుధవారం జారీ చేసిన ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే అరెస్టు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్డర్లు విడుదల చేసింది. ఈ రోజు రాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, పాటించనివారిపై లీగల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) అవనీశ్ అవస్థీ తెలిపారు.

రేపటి నుంచి ఛండీగడ్‌లోనూ..

కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని ఛండీగడ్ మంగళవారం ఆదేశింది. బుధవారం నుంచి ప్రజలు తప్పకుండా మాస్కులైనా లేదా వస్త్రాలైనా ముఖానికి కవర్ చేసుకోవాలని కేంద్రపాలిత ప్రాంతం ఛండీగడ్ అడ్వయిజర్ మనోజ్ పరిదా తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారికి పోలీసులు వార్నింగ్ ఇస్తారని వివరించారు. అయితే, ఉల్లంఘించినందుకు జరిమానా విధించాలా? అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు.

ఒడిశాలో..

ఒడిశా ప్రభుత్వమూ సోమవారం ఇటువంటి ఆదేశాలనే జారీ చేసింది. అత్యవసర పనులపై ప్రజలు బయటికెళ్లినప్పుడు మాస్కులు లేదా మాస్కు రూపంలో వస్త్రాలనైనా ముఖం, చెవులను కవర్ చేసుకునేందుకు తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు రేపు ఉదయం నుంచి అమల్లోకి రాబోతున్నాయి.

లాక్‌డౌన్‌కు ముందే నాగాల్యాండ్‌లో..

కాగా, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రాకముందే నాగాల్యాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్కువమందితో కలిసేవారు తప్పకుండా మాస్కులు ధరించాలని, హ్యాండ్ శానిటైజర్ వినియోగించాలని గతనెల రెండో వారంలోనే రాష్ట్ర హోం శాఖ ఆదేశాలు విడుదల చేసింది. అన్ని కంపెనీలు, సంస్థల్లోనూ హ్యాండ్ శానిటైజర్లను తప్పక అందుబాటులో ఉంచాలనీ పేర్కొంది.

Tags: masks, mandatory, legal actions, public place, arrest, violators

Next Story