మేడారం జాతరకు ఒమిక్రాన్ గుబులు.. సర్కార్ తర్జన భర్జన

by  |
Medaram Jathara
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరో రెండు నెలల్లో షురూ కానున్న మేడారం జాతరలో ఒమిక్రాన్​ వైరస్​వ్యాప్తి పెరగకుండా ఏం చేస్తే బాగుంటుందని సర్కార్ ఆలోచిస్తున్నది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు రానున్న నేపథ్యంలో కొవిడ్ కంట్రోల్‌కు పకడ్భందీగా ప్లాన్‌ను తయారు చేయాలనుకుంటున్నది. భక్తులకు అసౌకర్యం కలుగకుండానే కొవిడ్​నిబంధనలతో జాతర జరిగేలా ఏర్పాటు చేయనున్నారు. కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఆంక్షలు విధించాలనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మరోవైపు మన తర్వాత మేడారం జాతరకు అత్యధిక సంఖ్యలో ఛత్తీస్​గఢ్ నుంచి వచ్చే భక్తులపై కూడా ప్రభుత్వం ఫోకస్​పెట్టనున్నది.

అయితే అంతరాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు బోర్డర్లలో టెస్టులు చేయాలనుకుంటున్నది. కానీ వచ్చినోళ్లందరికీ టెస్టులు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే సందిగ్థంలో ఉన్నది. ఎక్కువ జనాలు ఒకేసారి వస్తే హెల్త్​ క్యాంపులు ఎలా పెట్టాలని మదనపడుతున్నది. దీంతో సీనియర్ అధికారులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటున్నది. గత ఏడాది సంక్రాంతి తర్వాత కేసులు పతాక స్థాయిలోకి చేరిన పరిస్థితులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ములుగు జిల్లాలో స్పెషల్​ టీం పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు, వివరాలను సేకరించింది.

అందుకే వాయిదా..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకున్న హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల తొలి వారం నుంచే ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకున్నా, అది అమలు కాలేదు. మేడారం జాతర ఏర్పాట్లు జరుగుతున్నందునే తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతర పరిస్థితుల్లో ప్రజలు సహకరించే పరిస్థితి ఉండదని ఆ జిల్లా ముఖ్య అధికారుల సూచనతో తాత్కాలికంగా నిలిచిపోయింది. మరోవైపు ఒమిక్రాన్​ప్రభావంతో సిరిసిల్లలో కూడా పెండింగ్​ పెట్టేశారు.

ఇదిలా ఉండగా గత నాలుగు సంవత్సరాల నుంచి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ వాయిదా పడటం గమనార్హం. ప్రజారోగ్య బలోపేతం కోసం ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు సర్కార్​ వద్ద ఉండాలని, ఈ మేరకే హెల్త్​ ప్రొఫైల్​ప్రాజెక్ట్​అని సర్కార్ గతంలో చెప్పింది. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఈ ఏడాది జూన్ 8న కేసీఆర్ ప్రకటించారు. కానీ ప్రతీ సారి అది ఏదో కారణంతో పెండింగ్​పడుతున్నది.

Next Story