ఓఎన్‌జీసీ చమురుక్షేత్రాల విక్రయానికి కేంద్రం ఆదేశాలు!

by  |
ఓఎన్‌జీసీ చమురుక్షేత్రాల విక్రయానికి కేంద్రం ఆదేశాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ చమురు ఉత్పత్తి సంస్థ ఓఎన్‌జీసీకి చెందిన కీలక చమురు క్షేత్రాల ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో రత్న ఆర్-సిరీస్ వంటి చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి చేసే వాటాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని, కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో విదేశీ భాగస్వామ్యాన్ని పొందాలని పెట్రోలియ మంత్రిత్వ శాఖ దేశీయ అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు ఓఎన్‌జీసీకి తెలిపింది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మోనటైజ్ చేయాలని, ఉత్పత్తిని పెంచడానికి డ్రిల్లింగ్, ఇతర సేవలను ప్రత్యేక సంస్థగా మార్చాలని పేర్కొంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అమర్ నాథ్, ఓఎన్‌జీసీ చైర్మన్, ఎండీ సుభాష్ కుమార్‌కు కార్యాచరణ ప్రణాళికను ఇచ్చారు.

దీని ద్వారా 2023-24 నాటికి చమురు, గ్యాస్ ఉత్పత్తిని మూడింట ఒక వంతు పెంచేందుకు సహాయపడనుంది. అదేవిధంగా డ్రిల్లింగ్, వెల్ సర్వీసెస్, వర్క్ ఓవర్ సర్వీసెస్, డేటా ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక మార్గాలను అన్వేషించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే ఏడాదిలోగా ఓఎన్‌జీసీకి చెందిన 149 చిన్న, మార్జినల్ చమురు క్షేత్రాలను ప్రైవేట్, విదేశీ సంస్థలకు విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వం యాజమాన్య ఓఎన్‌జీసీ పరిధిలో పెద్ద క్షేత్రాలపై మాత్రమే దృష్టి సారించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. గతంలో ఓఎన్‌జీసీ నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో మొదటి దశలో ప్రైవేటీకరణ కొనసాగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020-21లో మార్చి 31 నాటికి ఓఎన్‌జీసీ 20.2 మిలియన్ టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 20.6 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది.

Next Story