గ్రామాలపై నిర్లక్ష్యం.. పట్టణాలకే పరిమితమైన వ్యాక్సిన్

by  |
గ్రామాలపై నిర్లక్ష్యం.. పట్టణాలకే పరిమితమైన వ్యాక్సిన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడంలో పట్టణ ప్రాంతాలపై ఉన్న శ్రద్ధ అధికారులకు గ్రామీణ ప్రాంతాల్లో లేకుండా పోయింది. రూరల్ జిల్లాలో కరోనా వ్యాధి వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ వ్యాక్సినేషన్ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు, రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో 13,61,889 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయగా అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 41,659 డోసుల వ్యాక్సిన్లను మాత్రమే పంపిణీ చేశారు. దీంతో గ్రామాల్లో కరోనా వ్యాధివ్యాప్తికి కట్టడిచేసేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితాలనివ్వడం లేదు.

సరిహద్దు జిల్లాలో వ్యాధివ్యాప్తి ఎక్కవగా ఉందని ఇటీవల ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నాలుగు విడతల్లో పర్యటనలు చేపట్టి సీఎం కేసీఆర్‌కు నివేధికలందించారు. వ్యాధి వ్యాప్తికి తగిన చర్యలు తీసుకున్నామని ప్రకటించిన అధికారులు వ్యాక్సినేషన్ పంపిణీని వేగం చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. సరిహద్దు జిల్లాలో ఒకటిగా ఉన్న నారాయణపేట జిల్లాలో కరోనా వ్యాధివ్యాప్తి అధికంగా ఉందని గుర్తించిన అధికారులు ఆ ప్రాంతంలో వ్యాక్సినేషన్ అందిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. రాష్ట్రంలోనే అత్యల్పంగా వ్యాక్సినేషన్ చేపట్టిన జిల్లా నారయణపేట కావడంతో ఆ ప్రాంతంలో కేసుల సంఖ్యతగ్గడం లేదు.

గ్రామీణ ప్రాంతాల్లో అరకొర వ్యాక్సిన్

వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి పట్టణాలు, నగరాల్లో టీకాను పంపిణీ చేసినంత వేగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేయలేకపోతుంది. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో కరోనా వ్యాధివ్యాప్తి కంట్రోల్‌లోకి వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వ్యాధి వ్యాప్తికోసం ఐసోలేషన్ సెంటర్లను, క్యాంపులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం వ్యాక్సినేషన్లను మాత్రం చేపట్టడం లేదు. వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి వేయించుకోలేని గ్రామీణ ప్రజలు వ్యాధి భారిన పడి తనువు చాలిస్తున్నారు.

అధికంగా హైదరాబాద్, అత్యల్పంగా నారాయణపేటలో వ్యాక్సిన్

రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో 13,61,889 వ్యాక్సిన్ డోసులను అందించారు. వీటితో పాటు అధికంగా మేడ్చల్ జిల్లాలో 6,71,823 వ్యాక్సిన్ డోసులు, రంగారెడ్డిలో 6,82,930 వ్యాక్సిన్ డోసులను అందించారు. అత్యల్పంగా నారాయణపేటలో 41,659, కుమరంభీం ఆసిఫాబాద్‌లో 54,173, వనపర్తిలో 66,125, జోగుళాంబ గద్వాలలో 62,735 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. అభివృద్ది చెందిన నగరాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి వేల మందికి ఒకేసారి వ్యాక్సిన్‌ను అందిస్తున్న ప్రభుత్వం, రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న జిల్లాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి డ్రైవ్‌లను చేపట్టడం లేదు.

జిల్లా వ్యాక్సిన్ డోసులు

హైదరాబాద్ 13,61,889
అదిలాబాద్ 70,976
భద్రాద్రికొత్తగూడెం 1,67,746
జగిత్యాల 1,65,746
జనగాం 76,819
భూపల్‌పల్లి 95,179
జోగుళాంబ గద్వాల 62,735
కామారెడ్డి 1,87,744
కరీంనగర్ 2,44,511
ఖమ్మం 1,84,909
కుమరంభీం ఆసిఫాబాద్ 54,173
మహబూబాబాద్ 1,24,407
మహబూబ్‌నగర్ 1,23,409
మంచిర్యాల 1,06,772
మెదక్ 1,29,583
మేడ్చల్ 6,71,823
నాగర్‌కర్నూల్ 1,14,224
నల్గొండ 1,64,205
నిర్మల్ 1,51,010
నిజామాబాద్ 1,97,223
పెద్దపల్లి 1,34,770
రాజన్నసిరిసిల్లా 1.21.469
రంగారెడ్డి 6,82,930
సంగారెడ్డి 1,99,173
సిద్ధిపేట 2,48,560
సూర్యపేట 1,67,098
వికారాబాద్ 82,053
వనపర్తి 66,125
వరంగల్ రూరల్ 72,260
వరంగల్ అర్బన్ 2,95,287
యాదాద్రి భువనగిరి 2,22,141
ములుగు 68,646
నారాయణపేట 41,659
———————————
మొత్తం 68,57,009
———————————


Next Story

Most Viewed