నేడు చలివాగు ప్రాజెక్టు తైబంది ఖరారు..

by  |
నేడు చలివాగు ప్రాజెక్టు తైబంది ఖరారు..
X

దిశ, పరకాల: దేవాదుల ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులు ఈరోజు చలివాగు ప్రాజెక్టు తైబంది ఖరారు చేయనున్నారు. ఈ మేరకు దేవాదుల ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ అమృత్, డివిజనల్ ఇంజనీర్ గిరిధర్ లు పెద్దకోడెపాక గ్రామ రైతు వేదిక కార్యాలయంలో చలి వాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులతో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో చలి వాగు ప్రాజెక్టు పరిధిలో కుడి ఎడమ కాలువలకు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాలో చర్చించనున్నారు. ఈ క్రమంలో రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. సాగునీరు ఆరుతడి పంటలకే పరిమితం చేస్తారా..? వరి పంటకు అవకాశం కల్పిస్తారా..? అనే మీమాంసలో రైతులు అధికారుల నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

కాలువలు గిట్లుంటే ఆయకట్టుకు సాగునీరు అందేదేలా..?

చలి వాగు ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు అందించే కుడి ఎడమ కాలువలు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. వానకాలం సీజన్లోనే చెరువు నిండా నీళ్లు ఉన్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీరు అందించలేని దుస్థితి నెలకొంది. కుడి కాలువ గండి పడటంతో రైతుల చందాలు వేసుకొని సరిచేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న నీరుకు అదనంగా దేవాదుల ద్వారా లిఫ్ట్ కావాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో కాలువలు పూడుకుపోయి, నాచు, చెట్లపొదలతో కాలువల ద్వారా పొలాలకు నీరు సాగని దుస్థితి నెలకొంది. కాలువలు సరి చేసిన తర్వాతే సాగు నీరు అందిస్తే చివరి ఆయకట్టు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందుతుందని ఆయకట్టు రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుడి, ఎడమ కాలువలకు తక్షణం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందనేది ఆయకట్టు రైతుల అభిప్రాయం.


Next Story

Most Viewed