ఇక లబోదిబో.. లబోదిబో

by  |
ఇక లబోదిబో.. లబోదిబో
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: హైవే పక్కనే 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో దానిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. ఆ భూమిని కబ్జా చేసి, వెంచర్లుగా మార్చి అమ్మకాలు కూడా జరిపారు. దానిని కొనుక్కున్న వారికి అసలు నిజం తెలియడంతో లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ – బోధన్ రోడ్డులో ప్రధాన రహదారిని ఆనుకుని సారంగాపూర్ శివారు శిఖం భూమి ఉంది. సర్వేనంబర్ 231లో 10ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా.. గతంలో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉన్నన్ని రోజు సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ బృందం రెండు దశాబ్దాల పాటు అక్కడ స్టే చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఎక్కడికి అయినా సులువుగా వెళ్లడానికి ఆ స్థలం అనువుగా ఉంటుందని బెటాలియన్ ఏర్పాటు చేశారు. పదిహేను ఏండ్ల క్రితం బెటాలియన్‌ స్థావరాన్ని అక్కడి నుంచి తీసేశారు. దీంతో అప్పటి నుంచి ఖాళీగా ఉన్న భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. అక్కడ ఎకరానికి ప్రస్తుతం కోటికి పైగా పలుకుతోంది. ఇంకేముంది సర్కార్ స్థలం (అసైన్డ్ భూమి)ని అనుకుని ఉన్న పట్టా భూములు 3 ఎకరాలను కోనుగోలు చేశారు. దానిని కాస్తా ప్రభుత్వ భూములు 10 ఎకరాలను కలుపుకుని వెంచర్‌గా మార్చారు. ప్రజల అమాకత్వాన్ని, రిజిస్ట్రేషన్‌లపై, రెవెన్యూ భూములపై అవగాహన లేని వారిని లక్ష్యం చేసుకుని, తక్కువ ధరకు అంటూ రూ.2000లకు గజం చొప్పున 200 మందికి అమ్మారు. నాడు ఉన్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ల శాఖ అధికారులను మచ్చిక చేసుకుని నాన్ లే అవుట్ ప్లాట్లుగా మార్చి సుమారు రూ.10 కోట్లు దండుకున్నారు.

ఇండ్ల నిర్మాణం..

ఇటీవల అక్కడ కొందరు మూడు నాలుగు ప్లాట్లలో ఇండ్లను నిర్మించారు. అయితే ఈ విషయం రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కొందరు సీఎం కేసీఆర్‌కు, జిల్లా అధికారులకు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన రెవెన్యూ శాఖాధికారులు సంబంధిత శిఖం భూముల్లోకి ఎవరూ రావద్దని.. ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు. దానికి తోడు భూమి చుట్టూ ట్రెంచ్ కటింగ్ ఏర్పాటు చేశారు. అయితే రాత్రికి రాత్రే భూముల్లో ఏర్పాటు చేసిన బోర్డులను రియల్టర్లు తొలిగించేశారు. కాగా, విషయం తెలిసిన బాధితులు రియల్టర్ల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దానికి రియల్టర్‌లు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి తప్పించుకున్నారు. ఈ వ్యవహారంలో రూ. కోట్లు చేతులు మారినట్లు సమాచారం. కానీ అక్కడ ప్లాట్లు కొన్న పేదల పరిస్థితి దారుణంగా మారింది. తమ సొంతింటి కల నెరవేర్చుకోడానికి ఆ భూమిని కొనుగోలు చేశామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమను కొనుగోలు చేసిన భూములోకి వెళ్లనివ్వడం లేదని, రియల్ వ్యాపారులు ఇప్పుడు చేతులు ఎత్తేసినట్లు ఆందోళన చెందుతున్నారు.

అది ప్రభుత్వ స్థలమే..
రూరల్ తహసీల్దార్ ప్రశాంత్

సారంగపూర్ శిఖం భూములు సర్వేనంబర్ 231 లో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో ప్రైవేట్ వ్యక్తులు వెంచర్‌లు ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో వాటిని తొలిగించాం. అక్కడికి ఎవరూ వెళ్లకుండా ట్రెంచ్ కటింగ్ చేశాం. ఆ సర్వే నంబర్‌లో రిజిస్ట్రేషన్‌లు జరగకుండా సంబంధిత శాఖను కూడా అప్రమత్తం చేశాం.

రియల్టర్‌లపై చర్యలు తీసుకోవాలి
హరోణ్ ఖాన్, 13వ డివిజన్ కార్పొరేటర్

నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ శిఖం భూముల్లో ప్రైవేట్ వెంచర్‌లను ఏర్పాటు చేసి పేదలకు అమ్మిన రియల్టర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ప్రజలను నష్టపరిచే విధంగా రియల్ దందాలను చేసే వారిపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపాలి.



Next Story

Most Viewed