మాకూ ‘నర్సు బంధు’ కావాలి.. నర్సుల గళం

by  |
మాకూ ‘నర్సు బంధు’ కావాలి.. నర్సుల గళం
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని పదేపదే ప్రస్తావించే సీఎం కేసీఆర్, 85 శాతం ఎస్సీ, ఎస్టీలు ఉండే నర్సింగ్ సంక్షేమంపై దృష్టి సారించడం లేదు. స్వరాష్ర్టం ఏర్పడి ఏడేళ్లు పూర్తయిన తర్వాత కూడా తమకు న్యాయం జరగడంలేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ డెవలప్ మెంట్ కొరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వైద్యవ్యవస్థలో గ్రౌండ్ లెవల్‌లో పనిచేస్తున్నా, తమకు సరైన గుర్తింపు లేదని గుర్తు చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతీ ఒక్కరూ తమ సేవలు పొందుతున్నా, నర్సుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, ప్రజాఆరోగ్యం కొరకే పనిచేశామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైన నర్సుల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజారోగ్యం మెరుగు పడేందుకు నిర్వీరామంగా కృషి చేస్తున్న నర్సులకు ‘దళిత బంధు’ తరహాలో ప్రత్యేక స్కీంను ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు వెల్లువెత్తున్నాయి. హుజూరాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో ప్రవేశపెడుతున్న ఈ స్కీం తరహాలో ‘నర్సు బంధు’ అనే ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ప్రస్తుతం దళిత బంధు స్కీం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నంత ఆర్థిక సహాయం కాకపోయినా, దానిలో 50 శాతం నిధులైన సమకూర్చి పేద నర్సులకు అందిస్తే లాభం జరుగుతుందంటున్నారు. నర్సింగ్ ప్రొఫెషన్‌లో ఉండే వారంతా పేదలేనని, దీంతో దళిత బంధు లాంటి స్కీంలను ఇవ్వడం వలన ఆర్థికంగా కొంత వరకు మెరుగు పడవచ్చంటున్నారు.

నర్సింగ్ వృత్తిలో ఉన్న 85 శాతం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారేనని, అలాంటి వారిని ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని నర్సింగ్ అసోసియేషన్లు చెబుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఎంతో మంది పేషెంట్లను 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతున్నా, ప్రభుత్వాలు తమకు అండగా నిలవడం లేదని నర్సులు కృంగిపోతున్నారు. ఏళ్ల తరబడి తమపై వివక్ష కొనసాగుతుందంటున్నారు. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లకుండా మరీ విధులు నిర్వర్తించామని, కుటుంబ సభ్యులకు, పిల్లలకు దూరంగా ఉంటూ డ్యూటీలు చేసినా ప్రభుత్వం తమ కష్టాలపై దృష్టి సారించడం లేదని నర్సులు విమర్శిస్తున్నారు. తాము రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితుల్లో లేనందునే తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు.

అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలి…

ఎస్సీ, ఎస్టీలు అత్యధికంగా ఉండే నర్సుల సంక్షేమానికి ప్రభుత్వం అదుకోవాల్సిన అవసరం ఉన్నదని నర్సింగ్ అసోసియేషన్లు స్పష్టం చేస్తున్నాయి. దళిత బంధు తరహాలో ప్రత్యేక స్కీంతో పాటు అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ నిధిని పేద నర్సులకు సహాయం అందించేందుకు ఉపయోగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేక అధికారిని కూడా నియమించాలని కోరుతున్నారు. అంతేగాక బ్రెయిన్ ఇతర మేజర్ సర్జరీలు అవసరమైన వారి కొరకు ఈ నిధులను ఉపయోగించుకునేందుకు వెలుసుబాటును కల్పించాలంటున్నారు. హెల్త్ కార్డులో కవర్ కానీ ప్రొసీజర్లకు ఈ ఫండ్ ఇవ్వాలంటున్నారు. ఈ అత్యవసర నిధిని పేద నర్సులతో పాటు వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసి అనారోగ్యంతో ఉన్న వారికి ధీమా, భరోసాను కల్పించాలంటున్నారు.

ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూంలు కేటాయించాలి

Sujatha

నర్సింగ్ వ్యవస్థలో పేదలే ఎక్కువ మంది ఉంటారు. అది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో 85 శాతం మంది ఉన్నారు. వీళ్లల్లో చాలా మంది ఇళ్లు లేకుండా ఉన్నారు. వారందరిని గుర్తించి ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి. అంతేగాక ప్రతీ నెల వచ్చే జీతంతో కుటుంబ పోషణ కూడా సరిగ్గా నిర్వహించలేని వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రత్యేక స్కీంలో అర్హులను చేస్తూ సహాయం అందించాలి. కొవిడ్ డ్యూటీలు చేసిన వారందరికీ ఇన్సెంటీవ్‌లు ఇవ్వాలి. అంతేగాక నర్సింగ్ సమస్యల పరిష్కారానికి నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి.
-సుజాత, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్

నర్సుల పిల్లల చదువుకు సాయం చేయాలి

Rajeshwari

భర్త చనిపోయిన నర్సులు చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా సాయం అందించాలి. గురుకులాలు, రెసిడెన్షియళ్లలో ప్రత్యేక కేటగిరి కింద సీట్లు కేటాయించాలి. కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయిన వారికి కూడా అండగా ఉండాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వాలి. అర్బన్ ప్రాంతాల్లోని నర్సులైతే వేతనాలు సరిపోక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అద్దె, రవాణా ఛార్జీలు భరించలేకపోతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వమే ఇళ్లను కేటాయిస్తే కొంత వరకు మేలు జరుగుతుంది.
-రాజేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్


Next Story

Most Viewed