ప్రగతి భవన్ ముట్టడి.. నర్సులు అరెస్ట్

by  |
nurses protest
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ సమయంలో సేవలందించేందుకు నియమించుకున్న తమను అకారణంగా తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆస్పత్రులలో విధులు నిర్వహించిన నర్సులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 1640 మంది నర్సులను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలగించబడిన అవుట్సోర్సింగ్ నర్సులు విడతలవారీగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. భారీగా మోహరించిన పోలీసులు రోడ్ల పై భైఠాయించిన నర్సులను ఎక్కడికక్కడ అరెస్టులు చేపట్టి అక్కడి నుండి తరలించారు.

సుమారు సంవత్సరంన్నర పాటు సేవలందించిన తమ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడును ముఖ్యమంత్రికి విన్నవించుకునేందుకు వస్తే అడ్డుకోవడం ఏమిటంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే తమను విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన నర్సులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. క్యాంప్ కార్యాలయం ముట్టడించిన కొంతమంది నర్సులు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు

Next Story

Most Viewed