డ్రింక్స్ తాగాక ‘స్ట్రా’ తినేయొచ్చు..

by  |
డ్రింక్స్ తాగాక ‘స్ట్రా’ తినేయొచ్చు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో భాగమై చాలా కాలమైంది. మన రోజువారీ పనుల్లోనూ ప్లాస్టిక్ వినియోగం లేకుండా ఉండే చాన్స్ లేదు. మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా అవేర్‌నెస్‌తో ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే అనుకుంటాం. కానీ, అది అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. అలా ఏటా 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌ పదార్థాలను సముద్రంలో డంప్ చేస్తున్నాం. అయితే అందులో 437 మిలియన్ సంఖ్యలో ‘ప్లాస్టిక్ స్ట్రాస్’ ఉండటం గమనించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ స్ట్రాస్ యూసేజ్ తగ్గించేందుకు ‘నామ్’ అనే థానేకు చెందిన స్టార్టప్ కంపెనీ ఎడిబుల్(తినే) స్ట్రాస్ తయారు చేసింది. స్ట్రాతో ఏదైనా డ్రింక్ తాగిన తర్వాత బిస్కెట్ ఫ్లేవర్‌లో ఉండే ఆ స్ట్రాను కూడా తినేయొచ్చు. ఈ 6 రకాల ఫ్లేవర్లలో లభిస్తున్న ఈ తినే స్ట్రాస్‌ను తయారు చేయాలనే ఆలోచన వీరికి ఎలా వచ్చిందంటే..

ఐఐటీ గువహటిలో కెమికల్ ఇంజినీరింగ్ చదివిన శశాంక్ గుప్త.. తన స్నేహితుడు రాజ్‌పుత్‌తో కలిసి 2018లో పర్యావరణహిత ఉత్పత్తులు తయారీకి ఓ కంపెనీని ప్రారంభించారు. వంటగదిలో, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ను అందించడమే వీరి లక్ష్యం. అయితే మార్కెట్ స్టడీలో వినియోగదారులు రొటీన్ టైప్ వంటగది ప్రొడక్ట్స్‌ను ఇష్టపడటం లేదని తేలింది. పర్యావరణ హితమైన ఉత్పత్తులతో పాటు కొత్తదనం ఉండేలా, ఆ ప్రొడక్ట్స్ తినేందుకు వీలుగా ఉంటే బాగుంటుందని వారికి అర్థమైంది. దాంతో వారి ఆలోచన మారింది. అలా 2018లో తినే ఐస్ క్రీమ్ కప్‌లు లాంచ్ చేశారు. అయితే ఆ కప్‌లు పట్టుకునేందుకు వీలుగా లేకపోవడంతో వాటిని పక్కనబెట్టి స్ట్రాలు తయారు‌చేయాలని నిర్ణయించుకున్నారు. ‘ప్రజలు కోన్ ఐస్‌క్రీమ్ తిన్నపుడు ఎలా ఫీలవుతారో? అచ్చం అలాగే మిల్క్ షేక్‌ను స్ట్రాతో తాగిన తర్వాత, ఆ స్ట్రాను కూడా తినేలా తయారు చేస్తే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచనతో ప్రారంభమయ్యామని నామ్ కంపెనీ కో-ఫౌండర్ శశాంక్ వెల్లడించారు. ఈ స్ట్రాలు మొదట సముద్ర ఖనిజ లవణాలు ఉన్న పాచి ఫ్లేవర్‌లో తయారు చేయాలనుకున్నారు. కానీ, అలా చేయలేకపోయారు.

ఒక ఏడాదిపాటు రీసెర్చ్ చేసిన తర్వాత బిస్కెట్ ప్రొడక్ట్ ఉండే స్ట్రాలు తయారు చేశారు. టీ లేదా మిల్క్ షేక్‌లో స్ట్రా ఉంచిన తర్వాత అది ఘన పదార్థాంగానే ఉండటం వారికి చాలెంజ్‌గా మారింది. దీంతో ప్రొడక్ట్‌లో తేమ శాతం తగ్గించారు. తద్వారా ఆ పదార్థం గరిష్టంగా 20 నిమిషాల పాటు వాటర్ లేదా ఇతర పానీయంలో ఘనపదార్థంగానే ఉండేట్లు రూపకల్పన చేశారు. ఈ స్ట్రాలను మూడు సైజుల్లో(6, 8, 12 మిల్లిమీటర్లు) వెనీల, స్ట్రాబెర్రీ, చాక్లెట్, లెమన్, మింట్(పుదీన), కాఫీ వంటి ఆరు ఫ్లేవర్లలో రూపొందించారు.

కాగా, కస్టమర్లు పానీయాలు తాగిన తర్వాత స్ట్రాలు తినడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని ముంబై ఫ్లాగ్ రెస్టారెంట్ నిర్వాహకులు వెల్లడించారు. ‘ఇప్పటి వరకు తాము 300 స్ట్రాలు అమ్మామని, ఎలాంటి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదన్నారు. అంతేకాదు వినియోగదారులు ఇంకో ఎక్స్‌ట్రా స్ట్రా ఇవ్వాలని కోరుతున్నారని రెస్టారెంట్ నిర్వాహకుల్లో ఒకరైన ఆశిష్ తెలిపడం విశేషం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించిన గోధుమ, బియ్యం పిండితో పాటు కూరగాయల నూనె.. మొత్తం15 రకాల ఇన్‌గ్రేడియంట్స్‌తో ఈ తినే స్ట్రాలు తయారు చేస్తున్నట్లు శశాంక్ తెలిపారు.



Next Story

Most Viewed