ఆధార్ లేకుంటే వడ్డీలేని రుణం కట్

by  |
Aadhaar
X

దిశ, తెలంగాణ బ్యూరో : పేదలకు సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ‘వడ్డీ లేని రుణాలు’ పథకాన్ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే ‘ఆధార్’ చట్టానికి ఇటీవల చేసిన సవరణలను దృష్టిలో పెట్టుకుని ఇకపైన మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే విధిగా ఆధార కార్డు కలిగి ఉండాల్సిందేనని రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఆధార్ కార్డు లేకున్నా, దాని కోసం దరఖాస్తు చేయకున్నా ఇకపైన ఈ పథకానికి అర్హులు కారని ఆ ఉత్తర్వుల్లో కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే విధిగా ఆధార్ కార్డు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఒకవేళ ఆధార్ కార్డు లేనట్లయితే దాన్ని పొందడం కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలని, ఆ పని చేయనట్లయితే వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇందుకోసం స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలను నెలకొల్పాలని, ఆధార్ సంస్థ రిజిస్ట్రార్‌ లేదా సంబంధిత అధికారులతో మాట్లాడి కసరత్తు మొదలుపెట్టాలని సూచించారు. ఆధార్ కార్డు ఆధారంగా తీసుకునే బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్రలు అరిగిపోతే ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ పరికరాలను వాడాలని, ఇందుకోసం వాటిని సమకూర్చుకోవాలని సంబంధిత అధికారులను సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.

ఆధార్ కార్డు లేదా దరఖాస్తు చేసుకున్నట్లు ధృవీకరించే పత్రంతో పాటు ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, రేషను కార్డు, గ్రామీణ ఉపాధి హామీ గుర్తింపు కార్డు, పాన్ కార్డు లాంటి పది రకాల ఫోటో గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఒకవేళ వేలిముద్రలు, ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ లాంటివి సరిపోలకపోయినా, పనిచేయకపోయినా రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, అదీ పనిచేయకపోతే ఒరిజినల్ ఆధార్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని, ఇందుకోసం స్కానర్లను సమకూర్చుకోవాలని సూచించారు.

ఇప్పటికే రుణాలు తీసుకున్నవారికి వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలన్నా ఇదే విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు. ప్రతీ మహిళ ఈ పథకం కింద గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణం తీసుకునే సౌలభ్యం ఉంది.


Next Story

Most Viewed