పేరు గొప్ప..ఊరు దిబ్బ..

by  |
పేరు గొప్ప..ఊరు దిబ్బ..
X

దిశ, మేడ్చల్ :
‘వలస కార్మికులందరికి ఇక్కడ అన్నీ ఏర్పాట్లు చేస్తాం. వాళ్లందరూ మా బిడ్డలే. ఆపత్కాలంలో కచ్చితంగా వారిని ఆదుకుంటాం. మా సొంత బిడ్డలెక్క చూసుకుంటం.’ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ అన్న మాటలివి.

కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ గడువు ఏప్రిల్ 15 వరకు పొడగించడంతో మహానగరానికి వచ్చిన వలస కూలీలంతా తమ సొంతూళ్లకు వెళ్లేందుకు బాట పట్టారు. అయితే, వారిని పోలీసులు ఎక్కడికెళ్లొద్దు.. ఇక్కడ అన్నీ సౌలతులు ఏర్పాటు చేస్తామని చెప్పి..పునరావాస కేంద్రాలకు తరలించారు. కాని అక్కడ వారికి ఒక్క పూట తిండి కూడా దొరకడం లేదు.

ఇగ మళ్ల కనబడితే ఒట్టు..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పునరావాస కేంద్రాల పరిస్థితి. కేంద్రాల్లో తిండి పెట్టి ఎవరూ ఉపాసం ఉండకుండా చూసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు వలస కార్మికులను తీసుకొచ్చారు. కాని వారికి ఇప్పుడు బుక్కెడు బువ్వ దొరకడం లేదు. పునరావాస కేంద్రాలకు తరలించిన రోజు మాత్రమే మూడు పూటల ముద్ద బువ్వ పెట్టారనీ, ఆ తర్వాత నుంచి రోజుకు ఒక్కసారి పెడితే అదే గగనమవుతోందని కార్మికులు వాపోతున్నారు. ఆ పెట్టే తిండి కూడా కేంద్రంలో ఉన్న వాళ్లందరికీ సరిపోను పెట్టట్లేదు. ఇతర దాతలు స్పందించి ఇక్కడికొచ్చి పెడుతున్నరని వలసకార్మికులు చెబుతున్నారు. పోలీసు అధికారులు కేంద్రాలకు తరలించిన రోజే కనిపించారనీ, ఇగ మళ్ల కనబడితే ఒట్టు అని, అసలు ఇటువైపు రావడం లేదని అంటున్నారు. అయితే, ప్రసార మాధ్యమాల్లో మాత్రం వలస కార్మికులందరికీ మూడు పూటలా అన్నం పెట్టడంతో పాటు వైద్యం, బస ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అవేమీ కన్పించడం లేదు.

మేడ్చల్ జిల్లాలో 14వేల మంది గుర్తింపు..

మేడ్చల్ జిల్లాకు అత్యధికంగా వలస కూలీలు కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారు అధికంగా వస్తుంటారు. జిల్లా పరిధిలోని జీహెచ్ఎంసీతో పాటు 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కువగా పరిశ్రమలతో పాటు భవన నిర్మాణాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. వాస్తవానికి మేడ్చల్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య దాదాపు 30వేలకు పైగానే ఉంటోంది. కాని ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు 14 వేల మందిని గుర్తించినట్టు చెబుతున్నారు. వీరందరికీ జిల్లాలో 24కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తున్నట్టు అధికారులంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రంపరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వారికి సరైన సాకర్యాలు లేవు. వీరితో పాటు ఇటుక బట్టీల్లో మరో 3 వేల మందికి పైగానే ఇతర ప్రాంతాల నుంచి వలసొచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు.
వారిని ఆదుకోవాల్సి ఉంది.

ఆహార పొట్లాల కోసం పడిగాపులు..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కనీస స్థాయిలో పరిస్థితి లేకపోవడంతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ‘‘మా దారిన మేం ఇంటికి పోతుంటే.. పునరావాసం కల్పిస్తామని ఇక్కడికి తీసుకొచ్చిర్రు. ఇక్కడి బుక్కెడు బువ్వ పెట్టేందుకు గంటల తరబడి ఆశగా ఎదురుచూడాల్సి వస్తుంది. ఇంతకన్నా బయట దాతలు వచ్చి ఇచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటున్నామని’’ వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు బయటి వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో ఏ వస్తువులను పంచిపెట్టొద్దనీ, పోలీసుల ద్వారా కేంద్రాల్లోనే పంచిపెట్టాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. అధికారులు తమకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని వలస కార్మికులు కోరుతున్నారు. లేకపోతే ఆకలి చావులుంటాయనీ, ఆకలితో మాడుతామని అంటున్నారు.

Tags: no food, migrant workers, rehabilation centres, lock down, covid 19 effect

Next Story

Most Viewed