ఏది నిజం.. పోలీసు కొలువుల భర్తీపై నో క్లారిటీ

by  |
ఏది నిజం.. పోలీసు కొలువుల భర్తీపై నో క్లారిటీ
X

పోలీసుల కొలువుల భర్తీపై క్లారిటీ రావడం లేదు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంలో చెప్పిన గణాంకాలకు, మంత్రి కేటీఆర్ చెప్పే లెక్కలకు, తెలంగాణ స్టేల్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతున్నది. ఇంతకు భర్తీ చేసిన పోలీసు ఉద్యోగాలు ఎన్ని అన్నది ఎటూ తేలడం లేదు. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 31,972 ఉద్యోగాలు ఇచ్చాం” అని మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 25న రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మార్చి 15న గవర్నర్ తన ప్రసంగంలో 23,648 పోలీసులు కొలువులు భర్తీ చేసినట్టు చెప్పారు. టీఎస్ పీఆర్బీ మాత్రం 30,580 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 28,227 నియామకాలు చేపట్టింది. వీరిలో 23,233 మంది శిక్షణ పొందుతున్నరని చెబుతున్నది. ఇందులో ఏది నిజం..? ఇంతకూ భర్తీ చేసిన పోస్టులు ఎన్ని? అనేది అంతుచిక్కడం లేదు.

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో భర్తీ అయిన కొలువులపై లెక్కల్లో ఇంకా క్లారిటీ రావడంలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంలో పోలీసు శాఖలో 23,648 పోస్టుల్ని తెలంగాణ సర్కారు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. కానీ మంత్రి కేటీఆర్ గత నెల చివర్లో విడుదల చేసిన బహిరంగ లేఖలో మాత్రం 31,972 అని అన్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్ లెక్క ప్రకారం చూస్తే 28,277 భర్తీ అయ్యాయి. ఈ మూడు లెక్కలూ వేర్వేరుగా ఉన్నాయి. ఇంతకూ అసలు పోలీసు శాఖలో ఇచ్చిన కొలువులెన్ని? పార్టీల నేతల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళ పర్వం ముగిసిపోయింది. కానీ లెక్కల్లోని నిజం మాత్రం వెలుగులోకి రాలేదు.

ఆరున్నరేళ్ళలో 23 వేల పోస్టులు పెరిగాయి : గవర్నర్

బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో “తెలంగాణ ఏర్పడిన నాడు పోలీసు శాఖలో 63,181 పోస్టులుంటే, వాటి సంఖ్యను 86,829కి పెంచింది. వాహనాల సంఖ్యను 5,703 నుంచి 20,004కు పెంచింది” అని పేర్కొన్నారు. ఈ ఆరున్నరేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 23,648 పోస్టుల్ని పెంచింది. శాంతిభద్రతలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున గతంలో ఎన్నడూ లేనంగా ఈ శాఖకు బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించిందని గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ తీరును ప్రశంసించారు.

కేటీఆర్ లెక్క ప్రకారం 31,972 కొలువులు

“జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులతో పాటు ప్రతిపక్షాలు మీడియా ముఖంగా అవాస్తవాలు మాట్లాడుతున్న నేపథ్యంలో దుష్ప్రచారాన్ని ఎండగట్టేలా మా ప్రభుత్వం భర్తీ చేసిన 1,32,899 ఉద్యోగాల వివరాలను అంకెలతో సహా అందిస్తున్నాను. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలతో వారు అయోమయానికి గురికాకుండా ఉండే ఉద్దేశంతో ఈ వివరాలను జతపరుస్తున్నాను. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 31,972 ఉద్యోగాలు ఇచ్చాం” అని మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 25న రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

పోలీసు బోర్డు లెక్క 28 వేలు

స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు లెక్కలు ఇంకో రకంగా ఉన్నాయి. “తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఫైర్ సర్వీసులు, ఎస్‌పీఎఫ్, పోలీసు శాఖల్లోవివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి పోలీసు శాఖ ఇప్పటివరకు ఎనిమిది నోటిఫికేషన్లు ఇచ్చింది. మొత్తం 30,580 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 28,227 నియామకాలు చేపట్టింది. వీరిలో 23,233 మంది శిక్షణ పొందుతున్నారు” అని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు లిఖితపూర్వకంగా పేర్కొంది. ఇంకా 2,303 పోస్టులు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి. ఇక విధుల్లో చేరినవారి లెక్కను పరిగణనలోకి తీసుకుంటే మరింత గ్యాప్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ముగ్గురి లెక్కలు వేర్వేరుగా ఉండడంతో అసలు లెక్క ఏదో ఇప్పుడు మిస్టరీగా మారింది. అక్షరాలా సత్యం, ప్రభుత్వం చేసింది చెప్పుకోడానికి ఎందుకు భయం అనే తీరులో కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ఆ లెక్కలన్నీ ట్రాష్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. సవాళ్ళు విసురుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నర్ లెక్కలు భిన్నంగా ఉండడం ప్రతిపక్షాల సందేహాలు మరింత పెరిగినట్లయింది.

రిక్రూట్మెంట్ చేయడం రావడం లేదు – శ్రీనివాస్ గౌడ్, బాధితుడు

“పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు భర్తీ చేసే విధానం తెలియదు. నోటిఫికేషన్లు విడుదల మొదలు నియామకం వరకు పారదర్శకత కొరవడింది. నిబంధనలను సరిగ్గా పాటించడం లేదు. పరీక్షా ఫలితాలలో తప్పులు దొర్లుతున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్, మహిళల కోటా ఖరారు చేయడంలో చాలా తప్పిదాలు జరిగాయి. మహిళలకు 33 శాతానికి బదులుగా 10 శాతమే అమలవుతోంది. చివరకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సమాధానం చెప్పలేకపోతోంది. ఇంకా ఎనిమిది వేలకు పైగా పోస్టులు భర్తీ కాలేదు”.



Next Story