Nifty : నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్!

by  |
Nifty
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఆల్‌టైమ్ రికార్డు గరిస్థాలను నమోదు చేయడం గమనార్హం. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం లాభాలను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా 2020-21 ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మెరుగైన లాభాలను సాధించగలిగాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, టీకా పంపిణీ సానుకూల వార్తలు, కీలక షేర్ల ర్యాలీ కారణంగానే మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు తెలిపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 514.56 పాయింట్లు ఎగసి 51,937 వద్ద ముగియగా, నిఫ్టీ 147.15 పాయింట్లు లాభపడి 15,582 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అధికంగా 2 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ సూచీలు బలపడ్డాయి. మీడియా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, డా రెడ్డీస్, మారుతీ సుజుకి, ఐటీసీ, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు అధిక లాభాలను సాధించగా, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.52 వద్ద ఉంది.

Next Story

Most Viewed