వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు

by  |
వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా విధించిన ఆంక్షల నుంచి కార్యాలయాలకున్న పరిమితులను సడిలించిన తర్వాత సుమారు 90 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కావాలనుకుంటున్నారని ఇటీవల సిస్కో సిస్టమ్స్ పరిశోధనలో తేలింది. ఈ నివేదిక ప్రకారం… ప్రతి 10 మందిలో 9 మంది ఆఫీసులకు వెళ్లడం కంటే ఇంటి నుంచి పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారని తేలింది.

మూడింట రెండొంతుల మంది ఉద్యోగులు తమ పనిని ఇంటి నుంచి చేయడంలో ప్రయోజనాలను పొందుతున్నట్టు, ఇతర సవాళ్లను అధిగమిస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌కు ముందు చేసిన సర్వేలో 5 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆసక్తి చూపించగా, తాజా సర్వేలో 87 శాతం మంది ఇంటి నుంచి లేదంటే రీమోట్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కంపెనీలు సైతం నైపుణ్యం ఉన్న ఉద్యోగుల పట్ల కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నాయి.

తమ ఉద్యోగులు ఎక్కడ, ఎప్పుడు, ఎలా పనిచేస్తారో ఎన్నుకునే అవకాశాన్ని వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీనివల్ల సంస్థకు వ్యయం తగ్గడమే కాకుండా పని మరింత ఎక్కువ అందే వీలుందని కంపెనీలు భావిస్తున్నాయి. ‘ఉద్యోగుల కొత్త డిమాండ్లను తీర్చడంలో కంపెనీలు ఎలా పనిచేస్తాయనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇదివరకటి కంటే మెరుగైన కమ్యూనికేషన్, సహకారానికి ప్రాధాన్యత ఇస్తున్నరు. ఇంటి నుంచి పనిచేసినప్పటికీ వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ..సురక్షితంగా ఉన్నారో లేదో ఓ కంట కనిపెడుతున్నాయి’ అని సిస్కో వైస్ ప్రెసిడెంట్ గోర్డాన్ థామ్సన్ చెప్పారు. అలాగే, ఉద్యోగుల పనికి సంబంధించి పర్యవేక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి.



Next Story