సభలో క్షమాపణలు చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్

by Dishanational1 |
సభలో క్షమాపణలు చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ శుక్రవారం తన వీడ్కోలు ప్రసంగంలో క్షమాపణలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై జయాబచ్చన్ దూకుడుగా వ్యవహరించారు. ఈ విషయాన్ని జయా బచ్చన్ వీడ్కోలు ప్రసంగంలో ప్రస్తావిస్తూ, తన ప్రవర్తన కారణంగా రాజ్యసభ ఛైర్మన్ ఇబ్బంది పడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు బదులు మరో ప్రశ్నను తీసుకొచ్చిన కారణంగా కాంగ్రెస్ నేతను నిలదీశారు. ఈ వ్యవహరంలో జయాబచ్చన్ కల్పించుకుని, ఎందుకు ఈ పరిణామం చోటుచేసుకుందో చెబితే సభ్యులు అర్థం చేసుకుంటారని, వాళ్లు చిన్నపిల్లలేమీ కాదని ధన్‌ఖడ్‌కు సూచించారు. దీనికి సంబంధించే తాజాగా జయాబచ్చన్ ధన్‌ఖడ్‌కు క్షమాపణలు చెప్పారు. 'చాలామంది నాకు ఎందుకు కోపం వస్తుందని అడుగుతుంటారు. అది నా స్వభావమని, మార్చుకోవడం వీలవదన్నారు. దేన్నైనా ఇష్టపడకపోవడం, అంగీకరించకపోవడం వల్ల తన సహనాన్ని కోల్పోతాను. సభలో ఉన్న ఎవరి పట్లనైనా అలా ప్రవర్తించి ఉంటే వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నట్టు' జయాబచ్చన్ వెల్లడించారు.



Next Story

Most Viewed