ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరిన పాల ధరలు!

by Disha Web Desk 16 |
ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరిన పాల ధరలు!
X

న్యూఢిల్లీ: దేశీయంగా పాలు అత్యంత అవసరమైన వాటిలో ఒకటి. అలాంటిది గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పాల ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది పాల ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది కంటే సగటున పాల రిటైల్ ధర 12 శాతం పెరిగి లీటర్‌కు రూ. 57.15కి చేరుకుంది. తాజాగా విడుదల ప్రభుత్వ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తు ద్రవ్యోల్బణం 9.31 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠం అంటే 2014, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం తర్వాత పాల ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి. ప్రధానంగా పశువుల దాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో దేశంలోని చాలవరకు డెయిరీ సంస్థలు గత కొన్ని నెలల వ్యవధిలో పాల ధరలను క్రమంగా పెంచాయి.

అంతేకాకుండా 2020లో కరోనా వల్ల డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ సన్నగిల్లింది. అదే సమయంలో రైతులు ఖర్చులు తగ్గించుకునేందుకు పశువుల సంఖ్యను తగ్గించారు. దానివల్ల పాల ఉత్పత్తి దెబ్బతిని ప్రస్తుత పరిస్థితులకు కారణమైనట్టు నిపుణులు తెలిపారు. వీటికి తోడు ఇటీవల పశువులకు సోకిన వ్యాధుల కారణంగా కూడా ఉత్పత్తి నెమ్మదించిందని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రపంచ పాల సరఫరాలో దాదాపు నాలుగింట ఒక వంతు వాటాను కలిగిన భారత్ ప్రస్తుత పాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటొందని వెల్లడించారు.

Next Story

Most Viewed