నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటున్నది: రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటున్నది: రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటున్నట్టు తెలిపారు. లోక్ సభ ఎన్నికల రెండు దశల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ ముందుందని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీని వదిలించుకోవాలని చూస్తున్నారని వెల్లడించారు. దేశ ప్రజలంతా గాంధీ కుటుంబంతోనే ఉన్నారని రాహుల్, ప్రియాంకలు చేస్తున్న కృషిని దేశమంతా గుర్తించిందని స్పష్టం చేశారు. అమేథీ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రాబర్ట్ స్పందిస్తూ.. అమేథీలో గెలిచిన స్మృతి ఇరానీ తన హామీలను విస్మరించిదని విమర్శించారు. 1999 నుంచి అమేథీలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నానని తెలిపారు. కాగా, అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటాడనే ఊహాగానాల మధ్య రాబర్ట్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

అమేథీ, రాయ్‌బరేలీలకు నేడు అభ్యర్థుల ప్రకటన!

మరోవైపు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షతన నేడు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీ అనంతరం అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్రకటన ఉండనున్నట్టు తెలుస్తోంది. పంజాబ్‌లోని మిగిలిన ఐదు స్థానాలకు సైతం అభ్యర్థులను వెల్లడించే చాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే రాహుల్ అమేథీ నుంచి, రాయ్ బరేలీ నుంచి ప్రియాంకలు బరిలోకి దిగే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఇప్పటివరకు 317 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.



Next Story