యువతకు ఉద్యోగాల తలుపులు తెరుస్తాం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

by Dishanational2 |
యువతకు ఉద్యోగాల తలుపులు తెరుస్తాం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం మూసి ఉన్న ఉద్యోగాల తలుపులు తెరుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తప్పుడు హామీలు ఇస్తున్న మోడీ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘దేశ యువత ఒక విషయం గమనించండి. నరేంద్ర మోడీ ఉద్దేశం ఉపాధి కల్పించడం కాదు. ఆయన కొత్త పోస్టులను కూడా సృష్టించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఖాళీ పోస్టులను సైతం భర్తీ చేయడం లేదు’ అని పేర్కొన్నారు. ‘పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అందజేసిన డేటాను పరిశీలిస్తే.. 78 శాఖల్లో 9,64,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో 2.93 లక్షలు, హోంశాఖలో 1.43 లక్షలు, రక్షణ శాఖలో 2.64 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 ప్రధాన శాఖల్లో 30 శాతానికి పైగా పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి’ అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వడం భారంగా భావిస్తున్న బీజేపీ కాంట్రాక్టు వ్యవస్థను నిరంతరం ప్రోత్సహిస్తోందని, అక్కడ భద్రత, గౌరవం లేవని ఆరోపించారు. దేశంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే ఇండియా కూటమి లక్ష్యమని వెల్లడించారు.



Next Story

Most Viewed