China: ట్రంప్ ప్రతీకార సుంకలతో సతమతమవుతున్న చైనా

by Shamantha N |

అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా(China) సతమతమవుతోంది. కాగా.. టారీఫ్ ల అంశంపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ స్పందించారు.

China: ట్రంప్ ప్రతీకార సుంకలతో సతమతమవుతున్న చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా(China) సతమతమవుతోంది. కాగా.. టారీఫ్ ల అంశంపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ స్పందించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంతోపాటు సరఫరా వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామన్నారు. అంతేకాకుండా, పొరుగుదేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామన్నారు. బీజింగ్ లో జరిగిన కీలక సమావేశంలో జిన్ పింగ్ మాట్లాడారు. భవిష్యత్తులో పొరుగు దేశాలతో కలిసి పనిచేసే సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కొత్త వ్యవస్థను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు జరగాలని చెప్పినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

పొరుగుదేశాలతో..

కాగా.. ట్రంప్‌ టారీఫ్ ల దెబ్బతో చైనా కఠిన సమయాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశాలతో సత్సంబంధాలే మేలని చైనా గుర్తించినట్లు తెలుస్తోంది. భారత్‌ సహా జపాన్‌, దక్షిణ కొరియా వంటి పొరుగు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. టారీఫ్ ల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌-చైనాలు జట్టుకట్టాలని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా పేర్కొనడం గమనార్హం. ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్‌.. చైనాపై మరో 50శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో అక్కడ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు 104శాతానికి చేరాయి. అయితే, ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటామన్న బీజింగ్.. తగిన జవాబు చెప్పేందుకు రెడీగా ఉన్నామని పేర్కొంది.

Next Story