మణిపూర్‌లో ఆగని హింస: బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు

by Dishanational2 |
మణిపూర్‌లో ఆగని హింస: బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజాగా బుధవారం రాత్రి తౌబాల్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తిరుగుబాటుదారులు దాడి చేయగా ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డట్టు పోలీసులు వెల్లడించారు. తౌబాల్ ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ ఇండియన్ బెటాలియన్ కాంప్లెక్స్‌ లక్ష్యంగా తిరుగుబాటు దారులు కాల్పులకు తెగపడ్డారు. దీంతో భద్రతా బలగాలు వారిని తిప్పికొట్టే క్రమంలో ముగ్గురు జవాన్లు గౌరవ్ కుమార్, సోబ్రామ్ సింగ్, రామ్‌జీలకు గాయాలుకాగా వారిని ఇంఫాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. భద్రతా సిబ్బందిని, మందుగుండు సామగ్రిని మోరేకు తరలించడానికి హెలికాప్టర్ కావాలని మణిపూర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతకుముందు జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించారు. ఈ క్రమంలోనే సీఎం బిరేన్ సింగ్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాగా, గతేడాది మేలో మైతీ, కుకీ తెగల మధ్య జాతి హింస ప్రారంభమైంది. అప్పటి నుంచి సుమారు 200 మంది మృతి చెందగా, 50,000 మంది నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed