ఆస్తి కోసం భర్తను గొలుసుతో కట్టేసి గదిలో నిర్భంధించిన భార్య

by Disha Web Desk 23 |
ఆస్తి కోసం భర్తను గొలుసుతో కట్టేసి గదిలో నిర్భంధించిన భార్య
X

దిశ, ఘట్కేసర్: ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసి బందీగా చేసింది ఓ భార్య. మూడు రోజులుగా ఒకే గదిలో బంధించి నరకం చూపిస్తోంది. తిండి తినాలన్నా, నిద్ర పోవాలన్న, మలమూత్ర విసర్జన చేయాలన్న అదే గదిలోనే. ఇంతటి అమానవీయ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. మూడు రోజులుగా గదిలో నిర్బంధించి చిత్రవధ చేస్తున్నటువంటి దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించి స్థానిక మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ కు పంపించగా శుక్రవారం విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు పత్తి నరసింహ కథనం ప్రకారం...

ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ లో బుడగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పత్తి నరసింహ (50), భార్య భారతి (45)కి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెల వివాహం జరిగింది. నరసింహ వృత్తిరీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్. అయితే భార్యాభర్తల పేరున రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం భార్య పేరు మీద ఉన్న ఫ్లాట్ లో భవన నిర్మాణం చేపట్టారు. అయితే ఈ నిర్మాణం కోసం తాను అప్పులు చేశానని తన పేరు మీద ఉన్న ప్లాటును అమ్మి అప్పులు తీరుస్తానని నరసింహ భార్యతో చెప్పగా వివాదం తలెత్తింది. ఆస్తి విషయంలో భార్యతో పడలేని నరసింహ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.

మూడు రోజుల క్రితం ఇతడి ఆచూకీ తెలుసుకున్న భారతి కుల పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి నరసింహ ఉన్న చోటికి వెళ్లి పట్టుకుని ఘట్కేసర్ లోని సొంత ఇంట్లో ఓ గదిలో గొలుసుతో కట్టేసి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డ మహేష్ పోలీసులకు, మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. ఘట్కేసర్ సీఐ సైదులు ఆదేశాల మేరకు ఎస్సై శ్రీకాంత్, పెట్రోలింగ్ పోలీసులు పత్తి నరసింహ ఇంటికి వెళ్లగా గొలుసులతో కట్టేసి ఉన్న నరసింహను చూసి అవాక్కయ్యారు. నరసింహ భార్యను తమ స్టైల్ లో బెదిరించి అతన్ని బంధ విముక్తి చేశారు. మూడు రోజులుగా కొడుతూ బాధలు పెట్టారని బాధితుడు పోలీసుల ముందు బోరున ఏడ్చేశాడు. బాధితుడిని వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. బాధితుడు నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.

Next Story

Most Viewed