Donald Trump: నోబెల్ పురస్కారానికి ట్రంప్‌ను నామినేట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని

by S Gopi |

మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల కోసం చేసిన కృషిని నెతన్యాహూ ప్రత్యేకంగా ప్రశంసించారు.

Donald Trump: నోబెల్ పురస్కారానికి ట్రంప్‌ను నామినేట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సైతం నోబెల్ బహుమతి కోరుకుంటున్న సంకేతాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని ఆయన మద్దతుదారులు, చట్టసభ సభ్యులు చాలాకాలం నుంచి కోరుతున్నారు. దానికోసం వారు తమ నామినేషన్లను కూడా సమర్పించారు. తాజా పరిణామాలను గమనిస్తే ఈసారి ట్రంప్‌నకు నోబెల్ వచ్చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వయంగా ప్రకటించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన సమావేశం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

ఈ క్రమంలో నోబెల్ కమిటీకి పంపిన నామినేషన్ లేఖను నెతన్యాహు ట్రంప్‌నకు అందించారు. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల కోసం చేసిన కృషిని నెతన్యాహూ ప్రత్యేకంగా ప్రశంసించారు. అనేక దేశాల మధ్య శాంతి కోసం ట్రంప్ ఎంతో కష్టపడ్డారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ట్రంప్‌ న్యాయం కోసం చేస్తున్న కృషి ఎంతో గొప్పది. మధ్యప్రాచ్యంలో ఆయన శాంతిభద్రతలకు చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెలీయులు మాత్రమే కాదు, మరెంతోమంది అభినందిస్తున్నారన్నారని నెతన్యాహు మీడియాకు తెలియజేశారు. కొన్నేళ్లుగా తనను తాను శాంతి దూతగా చెప్పుకుంటున్న ట్రంప్, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నామినేషన్ చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుకుగానూ నెతన్యాహుకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదివరకు భారత్, పాకిస్తాన్ మధ్య, అలాగే సెర్బియా, కొసావో మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తన పాత్రను పట్టించుకోలేదని నోబెల్ కమిటీని ట్రంప్ విమర్శించారు. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య శాంతిని కొనసాగించడంలో సహాయపడినందుకు, ఇజ్రాయెల్ సహా అనేక అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉద్దేశించిన అబ్రహం ఒప్పందాల విషయంలో మధ్యవర్తిత్వంపై తనకే క్రెడిట్ ఇవ్వాలని కోరారు.

Next Story