జాతరలో ఘోరం : కుప్పకూలిన భారీ జెయింట్ వీల్.. 40 మందికి పైగా గాయాలు

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో నిర్వహించిన భైసాహా మేళాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

జాతరలో ఘోరం : కుప్పకూలిన భారీ జెయింట్ వీల్.. 40 మందికి పైగా గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో నిర్వహించిన భైసాహా మేళాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సుమారు 80 మందితో తిరుగుతున్న 60 అడుగుల భారీ జెయింట్ వీల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జాతరలో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరగడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

నెల క్రితం హర్యానాలో..

సరిగ్గా నెల రోజుల క్రితం హర్యానాలోని ఫరీదాబాద్ సూరజ్‌కుండ్ జాతరలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు భారీ జెయింట్ వీల్ (ఆకాశ ఊయల) కుప్పకూలిన ఘటనలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి భారీ రంగుల రాట్నాల వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story