పిల్లల అక్రమ రవాణా..95 మంది చిన్నారులను రక్షించిన అధికారులు

by Dishanational2 |
పిల్లల అక్రమ రవాణా..95 మంది చిన్నారులను రక్షించిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తీసుకెళ్తున్న 95 మంది పిల్లలను యూపీ చైల్డ్ కమిషన్ అధికారులు రక్షించారు. కమిషన్ సభ్యురాలు సుచిత్ర చదుర్వేది సమాచారం మేరకు అప్రమత్తమై పిల్లలను సేఫ్ చేసినట్టు అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సర్వేష్ అవస్తి తెలిపారు. గోరఖ్ పూర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. పిల్లలందరూ 4 నుంచి 12ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారేనని వెల్లడించారు. వారికి ఆహారం, వైద్యం అందజేసినట్టు పేర్కొన్నారు. పిల్లలను విచారిస్తే వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తయకు తెలియదని సమాధానం ఇస్తున్నట్టు తెలిపారు.

పిల్లల తల్లి దండ్రులందరికీ సమాచారం ఇచ్చామని, వారు రాగానే పిల్లలను వారికి అప్పగిస్తామని చెప్పారు. అయితే బిహార్ నుంచి పిల్లలందరినీ మదర్సాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో స్పందించారు. ‘భారత రాజ్యాంగం ప్రతి చిన్నారికీ చదువుకునే హక్కు కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో పేద పిల్లలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి మదర్సాలలో ఉంచి మతం ఆధారంగా విరాళాలు పొందుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, గతవారం కూడా బిహార్ నుంచి వివిధ రాష్ట్రాలలోని మదర్సాలకు పంపబడుతున్న పిల్లల బృందాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చైల్డ్ కమిషన్ రక్షించింది.



Next Story