ఇండియా కూటమి కథ ముగిసింది: బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు

by Dishanational2 |
ఇండియా కూటమి కథ ముగిసింది: బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పని ఇప్పటికే ముగిసి పోయిందని తెలిపారు. శనివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పొత్తు ముగిసిందని, బిహార్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. కూటమి పేరు మార్చడానికి శాయశక్తులా ప్రయత్నించానని గుర్తు చేశారు. కానీ అందుకు కొందరు నేతలు ఒప్పుకోలేదని ఆరోపించారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ సింగ్ ఇండియా కూటమికి దూరమైన నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీశ్ ఇటీవల కూటమి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.

ఎన్డీయేకు గతంలో కంటే ఎక్కువ సీట్లు

తేజస్వీ యాదవ్‌తో సహా ఆర్జేడీ కోటా మంత్రుల శాఖల దర్యాప్తుపై నితీశ్ క్లారిటీ ఇచ్చారు. తేజస్వీకి సంబంధించిన శాఖల విచారణపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఎక్కడైనా అవకతవకలు జరిగితే తప్పకుండా విచారణ చేపడతామని చెప్పారు. తప్పు జరిగినప్పుడే ప్రతి ఒక్కరికీ భయం ఉంటుందని తెలిపారు.బిహార్ ముఖ్యమంత్రి కోసం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..పరిస్థితులు బాగా లేకపోవడంతోనే ఆర్డేడీని వీడానని..ఎవరు ఎన్ని చెప్పినా ఇండియాలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయేకు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దీమా వ్యక్తం చేశారు.

Next Story