ఒడిశా రైలు ప్రమాదంపై రంగంలోకి సీబీఐ.. ఏజెన్సీ ఎంట్రీతో తీవ్ర ఉత్కంఠ!

by Satheesh |
ఒడిశా రైలు ప్రమాదంపై రంగంలోకి సీబీఐ.. ఏజెన్సీ ఎంట్రీతో తీవ్ర ఉత్కంఠ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా బాలాసోర్‌లో సంభవించిన రైలు ప్రమాదం ఘటనపై సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఇండియన్ రైల్వే అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీబీఐ మంగళవారం తన దర్యాప్తును ప్రారంభించింది. ఇవాళ ఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేశారని, ఫెయిల్-సేఫ్ సిస్టమ్‌లో మార్పులు జరిగాయని వీటి వల్లే ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికారులు భావిస్తున్న తరుణంలో సీబీఐ విచారణ ఆసక్తిని రేపుతోంది.

ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంటే ఎవరు చేశారు..? ఎందుకు చేశారు అనేది దర్యాప్తులో ఏ మేరకు వెలుగు చూస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈ ప్రమాదంలో 278 మంది చనిపోగా వారిలో 101 మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేదని తూర్పు మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో 1100కి పైగా గాయపడ్డారని వారిలో 900 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మరో 200 మందికి ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు.



Next Story