ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై సుప్రీంకోర్టులో విచారణ.. టాప్ పాయింట్స్

by Dishanational4 |
ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై సుప్రీంకోర్టులో విచారణ.. టాప్ పాయింట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లో నమోదయ్యే ఓట్ల సంఖ్యకు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) స్లిప్పుల సంఖ్యకు మధ్య ఎన్నడూ తేడా రాలేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎం ఓట్లతో 4 కోట్లకుపైగా వీవీప్యాట్ స్లిప్‌లు సరిపోలాయని చెప్పింది. ఈ రెండింటికి సంబంధించిన లెక్కలో తేడా వచ్చిన సందర్భమేదీ లేనే లేదని ఈసీ స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి. ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది మణిందర్‌సింగ్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

సుప్రీంకోర్టు ప్రశ్నలు.. ఈసీ సమాధానాలు

* పిటిషనర్లలో ఒకరి తరపున అడ్వకేట్‌ నిజాంపాషా వాదిస్తూ.. ఓటరు ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌ స్లిప్‌ తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఖన్నా.. అలా చేస్తే ఓటరు గోప్యత దెబ్బతినదా అని ప్రశ్నించారు. ఇది ఓటర్‌ గోప్యతకు కానీ, ఓటరు హక్కులకు కానీ భంగం కలిగించదని పాషా బదులిచ్చారు. దీనిపై ఈసీ స్పందిస్తూ.. ‘‘వీవీ ప్యాట్ స్లిప్పులను ఓటర్లకు అందిస్తే.. అది వారి గోప్యతకు భంగం కలిగిస్తుంది. దాన్ని పోలింగ్ బూత్ వెలుపల దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అది ఎలా దుర్వినియోగం అవుతుందో మనం అంచనా వేయలేం’’ అని కోర్టుకు తెలిపింది.

* ‘‘వీవీ ప్యాట్ పేపర్‌ స్లిప్పుల లెక్కింపునకు ఎక్కువ టైం ఎందుకు పడుతోంది ? వాటి లెక్కింపు కోసం మెషీన్లను వాడొచ్చా ?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా.. ‘‘వీవీ ప్యాట్ స్లిప్పు కోసం వాడే పేపర్ సన్నగా, జిగటగా ఉంటుంది. అది నిజానికి లెక్కింపు కోసం పనికిరాదు’’ అని ఈసీ చెప్పింది.

* ‘‘మీరు మాకు చెబుతున్న దానికి, పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న ఈసీ సమాచారానికి మధ్య కొంత డిస్‌కనెక్షన్ ఉందని అనిపిస్తోంది. ఈ గ్యాప్‌ను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి ఈసీ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ‘‘మేం దాచడానికి ఏమీ లేదు’’ అని చెప్పారు. ‘‘ఇది ఎన్నికల ప్రక్రియ. పవిత్రంగా ఉండాలి. ఓటర్లు ఆశించినది జరగడం లేదని ఎవరూ భయాందోళన చెందకుండా చూసుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీకి సూచించింది.

* ‘‘ఓటరు విశ్వాసాన్ని ఈసీ కాపాడాలి. మొత్తం యంత్రాంగం యొక్క సమగ్రతను మేం ఎలా నిర్ధారించగలం?’’ అని కోర్టు ప్రశ్నించగా.. ‘‘ప్రజలు తరుచుగా అడిగే ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాలను మేం ఈసీ అధికారిక వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేస్తాం’’ అని ఈసీ బదులిచ్చింది.

* ‘‘బ్యాలెట్ పేపర్ ఓటింగ్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న పలువురు పిటిషనర్ల అభ్యర్థన సరికాదు. అది తిరోగమన సూచన’’ అని ఈసీ తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు.

బీఈఎల్, ఈసీఐఎల్ డైరెక్టర్లకు బీజేపీతో లింక్ : ప్రశాంత్ భూషణ్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) అనే రెండు ప్రభుత్వ సంస్థల డైరెక్టర్లు బీజేపీతో ముడిపడి ఉన్నారని ఓ పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటరీ కమిటీ ఈవీఎంలలో అవకతవకలను గుర్తించిందని, అయితే ఎన్నికల సంఘం దానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రెండు గంటల పాటు జరిగిన విచారణలో పలువురు పిటిషనర్లు తమ అభిప్రాయాలను కోర్టు ముందుంచారు.

వీవీ ప్యాట్ మెషీన్‌లోని లైట్ ఆన్‌లో ఉండాలి

‘‘వీవీ ప్యాట్ మెషీన్‌లోని లైట్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలి. ప్రస్తుతం ఈ లైట్‌ 7 సెకన్ల పాటు ఆన్‌లో ఉంటుంది. ఈ సమయంలో ఒకవేళ పేపర్‌ స్లిప్‌ అందించడం వీలు కాకపోతే కనీసం ఎల్లవేళలా లైట్ వెలుగుతూనే ఉండేలా చూడాలి. దీనివల్ల ఓటర్‌ స్లిప్ కటింగ్, బాక్స్‌లో పడిపోవడం చూడగలుగుతాడు. ఇది వారి గోప్యతకు అడ్డు రాదు’’ అని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు చెప్పారు. ఇటీవల కేరళలో జరిగిన మాక్‌ పోల్‌ గురించి కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కాసర్‌గోడ్‌లో జరిగిన మాక్‌ ఓటింగ్‌లో బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని న్యాయస్థానానికి తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఈసీ న్యాయవాది.. ఆ నివేదిక పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది.

జర్మనీ జనాభా ఎంత ?

‘‘చాలా యూరోపియన్ దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగించి బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌కు తిరిగి వచ్చాయి’’ అని ఓ పిటిషనర్ చేసిన వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మీరు జర్మనీ గురించి మాట్లాడుతున్నారు. అక్కడి జనాభా ఎంత ? నా సొంత రాష్ట్రం బెంగాల్‌లో కూడా జర్మనీ కంటే ఎక్కువ జనాభా ఉంది. ఎన్నికల ప్రక్రియపై మనకు నమ్మకం ఉండాలి తప్ప దాన్ని వెనక్కి లాగకూడదు’’ అని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు. ‘‘ఈవీఎంలు లేని సమయాన్ని మనం చూశాం. అప్పుడు ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ ప్రక్రియలోనైనా మానవ జోక్యం వల్ల సమస్యలు వస్తాయి. మానవ జోక్యం లేకుండా యంత్రాలు సక్రమంగా పనిచేస్తాయి’’ అని ఆయన చెప్పారు.

Next Story

Most Viewed