సీఎం కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుఖేశ్ సంచలన లేఖ

by Disha Web Desk 2 |
సీఎం కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుఖేశ్ సంచలన లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివానికి రూ. 45 కోట్లు ఖర్చు చేసినట్లు వివాదం కొనసాగుతున్న సమయంలో మండోలీ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ అగ్నికి ఆజ్యంపోసేలా సంచలన వివరాలను బైటపెట్టారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న 12 సీట్ల డైనింగ్ టేబుల్‌ను రూ. 45 లక్షలు పెట్టి కొనిచ్చింది తానేనని, చెన్నైలోని తన నివాసానికి వచ్చిన సత్యేంద్రజైన్ చూసిన తర్వాత ఇలాంటిదే కావాలంటూ ఫోటోలు తీసుకుని కేజ్రీవాల్‌కు చూపించారని తెలిపారు. కేజ్రీవాల్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణలు, ఫేస్‌బుక్‌లో మాట్లాడుకున్న వివరాలు తన దగ్గర ఉన్నాయని, వాటిని దర్యాప్తు సంస్థలకు ఇస్తున్నానని పేర్కొన్నారు. బెడ్‌రూమ్‌లోని డ్రెస్సింగ్ టేబుల్, పిల్లల బెడ్‌రూమ్‌లోని మరో డ్రెస్సింగ్ టేబుల్‌ను రూ. 34 లక్షలు పెట్టి కొనిచ్చానని తెలిపారు. ఇంట్లో వేర్వేరు చోట్ల సమకూర్చిన ఏడు అద్దాల (మిర్రర్) ఖరీదు రూ. 18 లక్షలని తెలిపారు. ఆయన బెడ్ మీద వాడుకునే రగ్గులు, బెడ్‌షీట్లు, దుప్పట్లు, దిండ్లు తదితరాలకు రూ. 28 లక్షలు ఖర్చు పెట్టానని తెలిపారు. మూడు గదుల్లో ఉన్న వాల్ క్లాక్‌ల ఖరీదు రూ. 45 లక్షలని పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు జైలు నుంచి లాయర్ ద్వారా శనివారం పంపిన లేఖలో పై వివరాలను వెల్లడించారు.

‘ఇమాన్‌దార్’ అని చెప్పుకుంటున్న కేజ్రీవాల్ ఖరీదైన వస్తువులను వాడుతున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ తాను న్యూస్ ఎక్స్ ప్రెస్ పోస్ట్ అండ్ ఎల్ఎస్ ఫిషరీస్ అనే తన కంపెనీ పేరు మీద ఇటలీ, ఫ్రాన్స్ నుంచి కొన్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ ఇంట్లో ఈ ఫర్నీచర్‌ను ఫిట్ చేసింది తనకు సంబంధించి రిషబ్ షెట్టీ అని వివరించారు. కేజ్రీవాల్ తన చార్టర్డ్ అకౌంటెంట్ విపుల్ గుప్త ద్వారా గిఫ్టుగా ఇవ్వాల్సిందిగా లేఖ రాయించారని తెలిపారు. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి దర్యాప్తు సంస్థలు వాటిని తనిఖీ చేసుకోవచ్చన్నారు. డైనింగ్ టేబుల్ కలర్ ఆలివ్ గ్రీన్ అని, ఆయన టేస్ట్ మేరకే ముంబై, ఢిల్లీ అడ్రస్ పెట్టి ఇటలీ, ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు సంస్థల ద్వారా ఇన్వెస్టిగేట్ చేయిస్తే మొత్తం వివరాలు వెల్లడవుతాయన్నారు. ప్రస్తుతం మార్కెట్ రేటును కూడా వ్యాల్యుయేషన్ చేయిస్తే కేజ్రీవాల్ ఎంత లగ్జరీ జీవితం గడుపుతున్నారో అర్థమవుతుందన్నారు.

డైనింగ్ టేబుల్ మీద భోజనానికి వాడే ప్లేట్లు, నీళ్ళు తాగే గ్లాసులు వెండితో తయారైనవని, సౌత్ ఇండియన్ జువెల్లర్ వీటిని రూ. 90 లక్షలతో అందించారని, ఇందుకు బదులుగా ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాజెక్టులో లబ్ధి పొందారని తెలిపారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఇంట్లోని డైనింగ్ రూమ్‌లో వాడుతున్న 15 భోజనం ప్లేట్లు, 20 మంచినీళ్ళ గ్లాసులు పూర్తిగా వెండితో తయారైనవని, చివరకు స్పూన్లు, వడ్డించే బౌల్స్ కూడా వెండివేనని తెలిపారు. లాయర్ అనంత్ మాలిక్ ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు శనివారం మూడు పేజీల లేఖలో పై అంశాలను వెల్లడించారు. ఒకవైపు కేజ్రీవాల్ తన అధికారిక బంగళాకు రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారని, ఢిల్లీ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఇంటి డిజైన్ పనులు జరిగాయని, ప్రజాపనుల శాఖ సెక్రటరీ అనుమతి అవసరం లేకుండా ఉండేందుకు ఐదు విడతల్లో బిల్లులు రూపొందించారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఇటీవల ఆరోపించారు. ఈ సమయంలో సుఖేశ్ చంద్రశేఖర్ తన లేఖ ద్వారా కేజ్రీవాల్ ఇంట్లోని ఖరీదైన ఫర్నీచర్ గురించి వివరాలను బహిర్గతపర్చడం గమనార్హం.



Next Story

Most Viewed