త్వరలోనే ఆ సీఎం రాజీనామా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
త్వరలోనే ఆ సీఎం రాజీనామా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాపై వరుస ఆరోపణలు చేసి ఫేమస్ అయిన బీజేపీ లోక్‌సభ ఎంపీ నిశికాంత్ దూబే మళ్లీ నోరు విప్పారు. ఈసారి ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్ సొరేన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. త్వరలోనే సీఎం సొరేన్ రాజీనామా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే.. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ వ్యక్తిగత కారణాలతో సోమవారం జార్ఖండ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని వెంటనే స్పీకర్ ఆమోదించారు.

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఏమన్నారంటే..

ఈనేపథ్యంలో స్పందించిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే.. ‘‘త్వరలోనే ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కూడా రాజీనామా చేస్తున్న ఎమ్మెల్యేల బాటలో నడుస్తారు. అదే జరిగితే సీఎం భార్య కల్పనా సొరేన్‌‌ తదుపరి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. కొత్త సంవత్సరం సొరేన్ కుటుంబానికి బాధలే మిగిల్చేలా ఉంది’’ అని దూబే తన ట్విట్టర్(ఎక్స్) అకౌంట్‌లో వివాదాస్పద పోస్టు చేశారు. భూకుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సీఎం హేమంత్ సొరేన్‌కు సమన్లు ​​జారీ చేసింది. విచారణకు తప్పకుండా హాజరుకావాలని.. ఇదే చివరి ఛాన్స్ అని వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు సమన్లు జారీ కావడం ఇది ఏడోసారి.

Next Story

Most Viewed