'శక్తి' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీని మళ్లీ టార్గెట్ చేసిన ప్రధాని మోడీ

by Dishanational1 |
శక్తి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీని మళ్లీ టార్గెట్ చేసిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని, ఇండియా కూటమి నేతలు మతానికి వ్యతిరేకంగా చేసే ప్రతి ప్రకటన ఉద్దేశపూర్వకంగానే ఉందని మోడీ ఆరోపించారు. మంగళవారం సేలంలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ, ఏప్రిల్ 19న ప్రతి ఒక్క ఓటు బీజేపీ-ఎన్డీయేకే వేయాలని తమిళనాడు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్-డీఎంకే ఇండియా కూటమి కావాలనే హిందూ ధర్మాన్ని విమర్శిస్తోందని, హిందూ మతాన్ని విమర్శించే విషయంలో వారు ఒక్క క్షణం కూడా ఆలోచించడంలేదు. ఇతర మతాలను మాత్రం ఒక్క మాటయినా అనరని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ 'శక్తి' వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు. శక్తిని ద్వంసం చేస్తామని డీఎంకె-కాంగ్రెస్‌ల ఇండియా కూటమి సవాలు చేస్తున్నాయి. 'మరియమ్మన్ ఇక్కడి శక్తిమాత. తమిళనాడులోని కంచి కామాక్షి ఒక శక్తి, మధురలో శక్తి మాత మధుర మీనాక్షి.. అటువంటి శక్తిని ద్వంసం చేస్తామని వారంటున్నారు. హిందూయిజంలో శక్తి అంటే మాతృ శక్తి, నారీ శక్తి. మహిళల పట్ల ఇండియా కూటమి ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ప్రధాని అన్నారు. డీఎంకె, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటివని మోడీ అభివర్ణించారు. డీఎంకె-కాంగ్రెస్ అంటే భారీ అవినీతి, కుటుంబ పాలన. కాంగ్రెస్‌ను వదిలించుకున్నాక దేశం 5జీ టెక్నాలజీకి చేరుకుంది. కానీ తమిళనాడులో డీఎంకెకు కూడా సొంత 5జీ ఉందని, ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాలు తమిళనాడును గుప్పిట్లో పెట్టుకున్నాయని విమర్శించారు.


Next Story