వారి నుంచి న్యాయవ్యవస్థను కాపాడండి: సీజేఐకి 21 మంది రిటైర్డ్ జడ్జీల లేఖ

by Dishanational2 |
వారి నుంచి న్యాయవ్యవస్థను కాపాడండి: సీజేఐకి 21 మంది రిటైర్డ్ జడ్జీల లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయవ్యవస్థను కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు సోమవారం లేఖ రాశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహింగంగా వ్యాఖ్యలు చేసి అవమానించడం ద్వారా కొందరు న్యాయవ్యవస్థను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేగాక రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థను అగౌరవపరచడమేనని స్పష్టం చేశారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.

న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. సమస్యను లేవనెత్తడంతోపాటు, న్యాయ ప్రక్రియలను ప్రభావితం చేయడానికి మోసపూరిత పద్ధతులను అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా అయితే ప్రజలు పూర్తిగా చట్టంపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థ ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా నిలబడాలని, న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని రక్షించాలని తెలిపారు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతలపై తీసుకున్న చర్యలకు సంబంధించి బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఈ లేఖ రాయడం గమనార్హం.

సీజేఐకి లేఖ రాసిన 21 మంది న్యాయమూర్తుల్లో నలుగురు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు. మిగిలిన 17 మంది ఇతర రాష్ట్రాల్లో హైకోర్టుల్లో పని చేసి రిటైరైన వారు ఉన్నారు. కాగా, గత నెల 26వ తేదీన కూడా 600 మంది న్యాయవాదులు సీజేఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని వారి నుంచి న్యాయవ్యవస్థను రక్షించాలని వారు కోరారు.


Next Story