సందేశ్‌ఖాలీ వివాదం: టీఎంసీ నేత అరెస్టు

by Dishanational2 |
సందేశ్‌ఖాలీ వివాదం: టీఎంసీ నేత అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్ ఖాలీలో లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత అజిత్ మైతీని పశ్చిమ బెంగాల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రముఖ నిందితుడిగా భావిస్తున్న టీఎంసీ నేత షేక్ షాజహాన్ సన్నిహితుడైన అజిత్‌కు వ్యతిరేకంగా ఆదివారం పలువురు మహిళలు నిరసన తెలిపారు. అజిత్ భూకబ్జాలు, దోపిడీకి పాల్పడ్డాడని అతనిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయనను టీఎంసీ నుంచి పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ మైతీ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. కాగా, సందేశ్ ఖాలీ ప్రాంతంలో టీఎంసీ కీలక నేత షాజహాన్, అతని మద్దతుదారులపై భూకబ్జా, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సందేశ్ ఖాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జనవరి 5న సందేశ్‌ఖాలీలోని తన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడి చేసినప్పటి నుంచి షాజహాన్ పరారీలోనే ఉన్నాడు. మరోవైపు సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక శిబిరాల్లో దీనిపై 1300కు పైగా ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed