- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నక్సలిజాన్ని సమర్ధించలే.. అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించిన ప్రముఖ సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు
నక్సలైట్లకు మద్దతుదారుడైన బి.సుదర్శన్‌రెడ్డిని ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని అమిత్ షా తప్పుపట్టిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నక్సలైట్లకు మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’కు చట్టవ్యతిరేకంగా 2011లో జస్టీస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ప్రముఖ సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు (Retired Supreme Court, High Court judges) తాజాగా స్పందించారు.
(Salwa Judum) సల్వాజుడుం రద్దు కేసులో (Supreme Court) సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుప్రీం తీర్పును తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన ప్రముఖ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ అంజనా ప్రకాష్, జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ కైలాష్ గంభీర్, జస్టిస్ మదన్, జస్టిస్ జేసీ, జస్టిస్ కురియన్, జస్టిస్ విక్రమ్, జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ గోపాల్ గౌడ, జస్టిస్ మురళీధర్, జస్టిస్ గోవింద్ మథుర్, జస్టిస్ చంద్రు, జస్టిస్ గోపాల్ రెడ్డి, జస్టిస్ కన్నన్, జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ మోహన్ గోపాల్, జస్టిస్ సీహెచ్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ రఘురామ్ ఓ ప్రకటనలో అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు.
సల్వాజుడుం (Salvajudum verdict) తీర్పు కేసులో నక్సలిజాన్ని గానీ, దాని భావజాలాన్ని గానీ ఎక్కడా సమర్ధించినట్లు పేర్కొనలేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తరపున ప్రచారం కోసం అమిత్ షా అటువంటి వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు గౌరవప్రదంగా, భావజాల కేంద్రీకృతంగా జరగాల్సిన ఎన్నికలని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వ్యక్తుల మధ్య జరగవని, అయినప్పటికీ అత్యున్నత పదవిలో ఉన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉపరాష్ట్రపతి ఎన్నికను గౌరవప్రదంగా భావించాలని, వ్యక్తిగత దూషణలు, పేరుపెట్టి అవమానించడం వంటి అసభ్య రాజకీయాలకు చోటు ఉండకూడదని హితవు పలికారు.






