ప్రధాని నియోజకవర్గం నుంచి తన నియోజకవర్గానికి హుటాహుటిన వెళ్లిపోయిన రాహుల్.. ఎందుకు ?

by Dishanational4 |
ప్రధాని నియోజకవర్గం నుంచి తన నియోజకవర్గానికి హుటాహుటిన వెళ్లిపోయిన రాహుల్.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా ఆపేసి కేరళలోని తన నియోజకవర్గం వయనాడ్‌కు బయలుదేరారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ (జనరల్ సెక్రటరీ) జైరాం రమేష్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘అత్యవసర’ పరిస్థితుల్లో వయనాడ్‌కు రాహుల్ వెళ్లాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు. శుక్రవారం ఉదయం కోజికోడ్ మెడికల్ కాలేజీ వద్ద ఏనుగు దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. వయనాడ్ జిల్లా పరిధిలో గత 17 రోజుల్లో ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో అధికార ఎల్‌డీఎఫ్ కూటమి, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి, బీజేపీలు వయనాడ్ జిల్లాలో శనివారం బంద్‌ నిర్వహించాయి. ఏనుగులు,అటవీ జంతువుల దాడుల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలంటూ ఆయా పార్టీల కార్యకర్తలు నిరసనకు దిగారు. అయితే పుల్పల్లి పట్టణంలో బంద్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు అటవీ శాఖ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈనేపథ్యంలో తన లోక్‌సభ నియోజకవర్గ(వయనాడ్) పరిస్థితిపై సమీక్షించేందుకు రాహుల్ హుటాహుటిన వారణాసి నుంచి వయనాడ్‌కు బయలుదేరి వెళ్లారు.

Next Story