నూతన అభివృద్ధికి గుర్తుగా వందే భారత్: ప్రధాని మోడీ

by Dishanational1 |
నూతన అభివృద్ధికి గుర్తుగా వందే భారత్: ప్రధాని మోడీ
X

భోపాల్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నూతన అభివృద్ధికి చిహ్నంగా వందే భారత్ మారిందని అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి ఈ రైలు కోసం డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. శనివారం మధ్యప్రదేశ్‌లో రాణి కమల్‌పతి స్టేషన్ లో భోపాల్-న్యూఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఏప్రిల్ ఫూల్ ప్రాంక్‌లు కాంగ్రెస్ చేస్తుందని, తాము మాత్రం వందే భారత్‌ను ప్రారంభించామని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. ‘గత ప్రభుత్వ హాయంలో దేశంలోని ఏకైక కుటుంబం మధ్యతరగతివారి అవసరాలపై శ్రద్ధ పెట్టలేదు. భారత రైల్వేల పరిస్థితే దీనికి ఉదాహరణ. కానీ మేము అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో భారత రైల్వేను ప్రపంచ అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేపట్టాం’ అని చెప్పారు. నూతన రైళ్లు సురక్షితం, పరిశుభ్రమే కాకుండా సమయానికి అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. నూతన వందే భారత్ కొత్త ఉపాధి అవకాశాలను, అభివృద్ధిని తీసుకొస్తుందని తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి మధ్యప్రదేశ్‌లో రైల్వేలకు రూ.13,000 కోట్లు కేటాయించినట్లు ప్రధాని చెప్పారు. గతాన్ని వదిలి మధ్యప్రదేశ్ అభివృద్ధి వైపు దూసుకెళ్లడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా, ప్రధాని ప్రారంభించిన ఈ వందే భారత్ రైలు దేశంలోనే 11వది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణోయ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగు భాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌లు పాల్గొన్నారు.



Next Story