పథకాల అమలులో ఎటువంటి వివక్షా లేదు: అసోం పర్యటనలో ప్రధాని మోడీ

by Dishanational2 |
పథకాల అమలులో ఎటువంటి వివక్షా లేదు: అసోం పర్యటనలో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల అమలులో ఎటువంటి వివక్షా లేదని, అర్హులైన ప్రతి పౌరుడికీ వాటి ప్రయోజనాలు అందుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోంలోని నల్‌బరీలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఎన్డీయే విధానాల అమలులో ఎలాంటి వివక్షా లేదన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరో 30 మిలియన్ల ఇండ్లను అందజేస్తామని, లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వృద్ధులకు రూ.5లక్షల వరకు వైద్య చికిత్స అందిస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన వారిని లబ్ధి దారులుగా చేర్చుతామని చెప్పారు.

గతంలో ఈశాన్య ప్రజలకు విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర తీవ్ర కృషి చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ 60ఏళ్లలో చేయలేనిది బీజేపీ పదేళ్లలో చేసిందని వెల్లడించారు. బ్రహ్మపుత్ర నదిపై వంతెనలు, రహదారి, నెట్‌వర్క్ విస్తరణ వంటివి చేశామని చెప్పారు. బీజేపీకి వేసే ప్రతి ఓటూ దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దోహద పడుతుందని తెలిపారు. కాగా, అసోంలోని 14లోక్ సభ స్థానాల్లో బీజేపీ 11, అసోం గణ పరిషత్ 2, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

‘సూర్యతిలకం’ వీక్షించిన ప్రధాని

నల్‌బరీ ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ తన టాబ్లెట్‌లో అయోధ్యలో జరిగిన శ్రీరాముని సూర్య తిలకం ప్రోగ్రామ్‌ని వీక్షించారు. ఈ శ్రీరామనవమి ఉత్సవాల వేడుక తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని తెలిపారు. ‘అయోధ్యలోని రామ్‌లల్లాపై సూర్య తిలకం చూశాను. కోట్లాది మంది భారతీయుల్లాగా నాకు కూడా ఇది ఎంతో ఉద్వేగభరితమైన క్షణం. అయోధ్యలో గొప్ప రామ నవమి చారిత్రాత్మకమైనది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ సూర్య తిలక్ మన జీవితాలకు ఎంతో శక్తిని అందించాలి. దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి ఇది ఎంతో స్ఫూర్తి నిస్తుంది’ అని పేర్కొన్నారు.


Next Story

Most Viewed