‘ఇండియా’ కూటమి చైర్మన్‌గా నితీశ్ కుమార్!

by Dishanational2 |
‘ఇండియా’ కూటమి చైర్మన్‌గా నితీశ్ కుమార్!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి దూకుడు పెంచింది. సార్వత్రిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ సహా ఇతర విషయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కూటమి చైర్మన్‌గా బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కూటమిలోని పలువురు నేతలు ఆమోదించినట్టు సమాచారం. ఈ వారంలో కూటమి నేతలు వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో కూటమి చైర్మన్ ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కాంగ్రెస్ చర్చించినట్టు వెల్లడించాయి. కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలతోనూ డిస్కస్ చేయనున్నట్టు సమాచారం.

కేజ్రీవాల్ మద్దతు

నితీశ్‌ను ఇండియా కూటమి చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. కూటమి ఏర్పాటులో నితీశ్ కీలక పాత్ర పోషించారని కాబట్టి ఆయననే చైర్మన్‌గా నియమించాలని కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌కు సైతం ఎటువంటి ఇబ్బంది ఉండబోదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలపై ‘ఇండియా’ కూటమి నేతలు ఎవరూ అధికారికంగా స్పందించక పోవడం గమనార్హం. మరోవైపు న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియా కూటమి నాలుగో సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే పేరును ప్రతిపాదించినప్పటికీ పీఎం క్యాండిడేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ నెల 30 నుంచి ఉమ్మడి ప్రచారం

పార్లమెంటు ఎన్నికలకు అతి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో సీట్ల షేరింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ విషయం ఓ కొలిక్కి వచ్చిన వెంటనే జనవరి 30 నుంచి కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలను కలుపుకుని ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇండియా కూటమి ఉంది.



Next Story

Most Viewed